Governance: ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టులు.. జూలై 18లోగా పూర్తి విడుదలకు ప్రణాళిక!
Governance: ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన పురోగతిని ప్రజలకు వివరించేందుకు ‘ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26’ పేరుతో నివేదికలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.
అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనపై ప్రజలకు వివరించనున్న ప్రభుత్వం..
రెండేళ్ల పాలనకు లెక్కలు.. అభివృద్ధి, సంక్షేమంపై ప్రజల ముందుకు ప్రభుత్వం..
అమరావతి: ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన పురోగతిని ప్రజలకు వివరించేందుకు ‘ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26’ పేరుతో నివేదికలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.
రాష్ట్ర పరిపాలనలో తీసుకొచ్చిన మార్పులు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, గవర్నెన్స్ సంస్కరణలను ప్రజలకు చేరవేయడమే ఈ ప్రోగ్రెస్ రిపోర్టుల ప్రధాన ఉద్దేశమని సీఎం తెలిపారు.
ఈ అంశంపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్ర పరిస్థితిపై విడుదల చేసిన ఏడు శ్వేత పత్రాలకు కొనసాగింపుగా యాక్షన్ టేకెన్ రిపోర్టుల రూపంలో ఈ నివేదికలు ఉంటాయని తెలిపారు.
గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వం గతంలో ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ వంటి అంశాలపై ఏడు శ్వేత పత్రాలను విడుదల చేసింది.
ఈ అంశాలపై తీసుకున్న చర్యలు, రెండేళ్లలో వచ్చిన మార్పులను ప్రోగ్రెస్ రిపోర్టుల్లో వివరించనున్నారు. అలాగే అభివృద్ధి, సుపరిపాలన, సంక్షేమం వంటి మూడు కొత్త అంశాలపై కూడా ప్రత్యేక నివేదికలు రూపొందించనున్నారు.
మొత్తం 10 అంశాలపై ప్రోగ్రెస్ రిపోర్టులు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఆర్థిక, అభివృద్ధి, సంక్షేమం, గవర్నెన్స్ అంశాలకు సంబంధించిన నాలుగు ప్రధాన నివేదికలను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా విడుదల చేయనున్నారు. మిగిలిన నివేదికలను మంత్రులు విడుదల చేయనున్నారు. మొత్తం అన్ని రిపోర్టులను జూలై 18లోగా ప్రజల ముందుకు తీసుకురావాలని సీఎం ఆదేశించారు.
అభివృద్ధి ప్రోగ్రెస్ రిపోర్టులో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను పొందుపరచనున్నారు. గుడ్ గవర్నెన్స్ రిపోర్టులో ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానాలు, పాలసీలు, పరిపాలనా సంస్కరణలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. వెల్ఫేర్ – ఎంపవర్మెంట్ రిపోర్టులో సంక్షేమ పథకాలు, పీ4 (P4) వంటి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను పొందుపరుస్తారు.
ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లిన విధానాలు ప్రజలకు స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని ఎలా గాడిలో పెట్టామో, ఏ రంగంలో ఎలాంటి పురోగతి సాధించామో ప్రజలకు వివరించడంతో పాటు తప్పుడు ప్రచారాలకు, ఫేక్ న్యూస్కు అడ్డుకట్ట వేయడం కూడా ఈ నివేదికల లక్ష్యమని తెలిపారు. ప్రతి ఏడాది ప్రోగ్రెస్ రిపోర్టులు విడుదల చేసే విధానాన్ని కొనసాగించాలని సీఎం సూచించారు.
అన్ని ప్రోగ్రెస్ రిపోర్టులను విడుదల చేసిన తర్వాత వాటన్నింటినీ కలిపి పుస్తక రూపంలో తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రోగ్రెస్ రిపోర్టులలో భాగంగా సోమవారం విద్యుత్ రంగంపై తొలి నివేదిక విడుదల చేయనున్నారు.
ఈ సమీక్షలో మంత్రులు పయ్యావుల కేశవ్, పొంగూరు నారాయణ, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తదితరులు వర్చుయల్ గా పాల్గొన్నారు. సీఎస్ సాయి ప్రసాద్తో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా సమీక్షలో పాల్గొన్నారు.
Tags
Be the first to react