Yogandhra: ఇంటింటికీ యోగా.. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు!
Yogandhra: ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాను ప్రజల జీవన విధానంలో భాగం చేయాలని నిర్ణయించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
యోగా-ఆధ్యాత్మికతతో ఆరోగ్యకర సమాజం.. యోగాంధ్రపై సీఎం కీలక ప్రకటనలు..
టెక్నాలజీకి ఆధ్యాత్మికత తోడైతే అన్స్టాపబుల్: సీఎం చంద్రబాబు..
అమరావతి: ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాను ప్రజల జీవన విధానంలో భాగం చేయాలని నిర్ణయించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇంటింటికీ యోగా చేరేలా చర్యలు తీసుకుంటామని, గ్రామ గ్రామాన యోగా మందిరాలను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. యోగాంధ్ర లోగో ఉన్న ప్రత్యేక చొక్కా ధరించి కార్యక్రమానికి హాజరైన సీఎం, ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి వివిధ యోగాసనాలు చేశారు. మంత్రి నారా లోకేష్ కూడా యోగాభ్యాసంలో పాల్గొన్నారు.
ప్రాణాయామం, అనులోమ విలోమ వంటి సాధనలతో పాటు పలు క్లిష్టమైన ఆసనాలను కూడా సీఎం చంద్రబాబు సులభంగా చేశారు. ఉదయం నుంచే విద్యార్థులు, యువత, అధికారులు, ఉద్యోగులు, ప్రజలు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రజలతో కలిసి సమాజ హితం కోసం బాధ్యతగా వ్యవహరిస్తామని సీఎం ప్రతిజ్ఞ చేయించారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ యోగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కృషి ఎంతో గొప్పదని అన్నారు. భారతదేశ ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి చాటుతున్నారని కొనియాడారు. ప్రధాని చొరవతో 190 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారని తెలిపారు.
“భారతదేశం ప్రపంచానికి మార్గనిర్దేశం చేయగల దేశం. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో ఉపయోగపడుతుంది. యోగాను ప్రజలకు చేరువ చేయడంలో బాబా రామ్దేవ్ సేవలు అభినందనీయం” అని సీఎం అన్నారు.
టెక్నాలజీతో ఆధ్యాత్మికతను కలిపి ముందుకు వెళితే భవిష్యత్లో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని ఆయన చెప్పారు. యోగా, ధ్యానం ద్వారా ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమని పేర్కొన్నారు.
స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు కార్యాలయాల్లో శాశ్వత యోగా మందిరాలను నిర్మించనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. యోగా కార్యక్రమాల పర్యవేక్షణ కోసం జిల్లా, మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమిస్తామని తెలిపారు.
యోగా సాధనకు సంబంధించి ప్రమాణాలను రూపొందించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తామని, యోగాంధ్ర కోసం ప్రత్యేక పోర్టల్ తీసుకువస్తామని చెప్పారు.
రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సంజీవని ప్రాజెక్టును ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. వైద్య నిపుణులను ప్రజలకు మరింత చేరువ చేస్తామని, సంజీవని కార్యక్రమంలో యోగాను కూడా భాగం చేస్తామని తెలిపారు.
ప్రతిరోజూ ఒక గంట యోగా, ధ్యానం, ప్రాణాయామం అలవాటు చేసుకుంటే అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చని అన్నారు. తాను కూడా గత 30 ఏళ్లుగా యోగాను సాధన చేస్తున్నానని, ఒత్తిడిని ఎదుర్కొనేందుకు యోగా ఎంతో సహాయపడుతోందని చెప్పారు.
విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ద్వారా రికార్డులు సాధించామని సీఎం గుర్తు చేశారు. వచ్చే ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తిరుపతిలో నిర్వహిస్తామని ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా 1.33 లక్షల కేంద్రాల్లో కోటి మందికి పైగా ప్రజలు యోగా సాధన చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 1.07 కోట్ల మంది పౌరులు, 2.5 లక్షల మంది శిక్షకులు యోగాలో పాల్గొన్నందుకు రెండు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించామని చెప్పారు. ఈ రికార్డుల గుర్తింపులను అధికారులు వేదికపై ముఖ్యమంత్రికి అందజేశారు.
జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్కు దూరంగా ఉండాలని సీఎం సూచించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని, రసాయన రహిత ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.
రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. యోగా, ఆధ్యాత్మికత, సాంకేతికత కలయికతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, యోగా-నేచురోపతి సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు, మంత్రులు సత్యకుమార్ యాదవ్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, సవిత తదితరులు పాల్గొన్నారు.
Tags
Be the first to react