LIVE
Singapore: సింగపూర్‌లో ఘనంగా 'మీట్ & గ్రీట్' – ప్రవాసాంధ్రులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆత్మీయ భేటీ!  •  Home Made Foods: అమ్మమ్మల కాలం నాటి యూషం... కారం, పచ్చిమిర్చి లేకుండానే కమ్మటి వంటకం!!  •  SIR 2026: మీ మొబైల్‌లోనే ఓటరు ఎన్యుమరేషన్ చేసుకోండిలా... పూర్తి వివరాలు!  •  Gold Price Today: ఆభరణాల ప్రియులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే..!  •  Basavatarakam Hospital: క్యాన్సర్ బాధితుల పాలిట ఆశాకిరణం.. 25 ఏళ్ల సేవలో బసవతారకం ఆస్పత్రి!  •  Cyber Security: డిజిటల్ దొంగల నుంచి మీ డబ్బు సేఫ్ గా ఉండాలా? ఈ 5 సెట్టింగ్స్ వెంటనే మార్చేయండి!  •  AP CRDA: అమరావతిలో ఆర్బీఐ బిగ్ ప్లాన్... మూడు ఎకరాల భూమి అప్పగించిన ఏపీసీఆర్డీఏ!  •  Pawan Kalyan: భారత నాగరికతలో యోగా ఒక అంతర్భాగం.. పవన్ కల్యాణ్ యోగా దినోత్సవ పోస్ట్ నెట్టింట వైరల్!  •  Amaravati Bank Street: అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్.. 13 భారీ బ్యాంకులతో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ షురూ!  •  Rain Alert: ఏపీలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్... ఆ మూడు గంటలే కీలకం!!  • 
⚡ BREAKING
Helping Hand

Basavatarakam Hospital: క్యాన్సర్ బాధితుల పాలిట ఆశాకిరణం.. 25 ఏళ్ల సేవలో బసవతారకం ఆస్పత్రి!

Basavatarakam Hospital
Basavatarakam Hospital

సేవే లక్ష్యంగా 25 ఏళ్ల ప్రస్థానం.. దేశంలోనే గుర్తింపు పొందిన బసవతారకం ఆస్పత్రి..

క్యాన్సర్‌పై పోరాటంలో ముందంజ.. లక్షలాది మందికి అండగా బసవతారకం..

హైదరాబాద్: క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న వేలాది మంది జీవితాల్లో ఆశను నింపుతూ, పేదలకు నాణ్యమైన క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చిన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 25 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది.

క్యాన్సర్ చికిత్స ఖరీదైనదనే భావనను మార్చి, సామాన్య ప్రజలకు కూడా ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఆస్పత్రి ప్రారంభమైంది. సేవాభావం, మానవతా దృక్పథంతో నడుస్తున్న ఈ సంస్థ నేడు దేశంలోనే ప్రముఖ సమగ్ర క్యాన్సర్ చికిత్స, పరిశోధనా కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది.

క్యాన్సర్ బాధితుల జీవితాలు మధ్యలోనే ఆగిపోకూడదనే ఆలోచనతో బసవతారకం ఆస్పత్రి ఏర్పాటుకు పునాది పడింది. దివంగత నందమూరి తారక రామారావు ఆధ్వర్యంలో 1988లో ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రవాస భారతీయులు, దాతల సహకారంతో ఏర్పడిన ఈ ప్రయత్నం 2000 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి చేతుల మీదుగా 100 పడకల ఆస్పత్రిగా ప్రారంభమైంది.

కాలక్రమేణా సేవలను విస్తరించుకుంటూ ప్రస్తుతం ఇది 650 పడకల సామర్థ్యంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్యాన్సర్ ఆస్పత్రిగా ఎదిగింది.

గత 25 ఏళ్లుగా బసవతారకం ఆస్పత్రి వేలాది మంది క్యాన్సర్ బాధితులకు అండగా నిలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా రోగులు ఇక్కడికి వచ్చి చికిత్స పొందుతున్నారు.

ప్రస్తుతం ప్రతి సంవత్సరం సుమారు 3 లక్షల మంది అవుట్‌పేషెంట్లు, 90 వేల మంది ఇన్‌పేషెంట్లకు ఆస్పత్రి వైద్య సేవలు అందిస్తోంది. ఇప్పటివరకు 8 వేలకు పైగా క్యాన్సర్ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించగా, 86 బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సలు కూడా పూర్తి చేశారు.

ఆస్పత్రికి వచ్చే రోగుల్లో 65 శాతానికి పైగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారే ఉండటం విశేషం. తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించడం వల్ల బసవతారకం ఆస్పత్రి “పేదల ఆస్పత్రి”గా ప్రత్యేక గుర్తింపు పొందింది.

క్యాన్సర్ చికిత్సలో ఆధునిక పద్ధతులను అందుబాటులోకి తీసుకురావడంలో ఆస్పత్రి ముందంజలో ఉంది. సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ విభాగాలతో పాటు రేడియాలజీ, పాథాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, మెడికల్ ఫిజిక్స్, పరిశోధన విభాగాల్లో నిపుణులు సేవలు అందిస్తున్నారు. సుమారు 250 మంది వైద్యులు, వైద్య సిబ్బంది క్యాన్సర్ రోగులకు నిరంతరం సేవలందిస్తున్నారు.

క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే ప్రాణాలను కాపాడవచ్చనే లక్ష్యంతో బసవతారకం ఆస్పత్రి గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది.

ప్రత్యేక మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సుల ద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా వైద్య సేవలను తీసుకెళ్తోంది. డిజిటల్ మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్‌రే వంటి సదుపాయాలతో ప్రజల వద్దకే చేరుతోంది.

తల, మెడ, రొమ్ము, సర్వికల్, ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్లకు సమగ్ర చికిత్సలు అందిస్తోంది. బాధితుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పాలియేటివ్ కేర్ సేవలను కూడా నిర్వహిస్తోంది.

ఎన్టీఆర్ సతీమణి బసవతారకం గారి చివరి కోరిక మేరకు ప్రారంభమైన ఈ ఆస్పత్రి నిర్వహణను నందమూరి బాలకృష్ణ పవిత్ర బాధ్యతగా కొనసాగిస్తున్నారు. ఆస్పత్రి ఛైర్మన్, మేనేజింగ్ ట్రస్టీగా బాలకృష్ణ ఆధ్వర్యంలో పేదలకు మరిన్ని అత్యాధునిక వైద్య సేవలు అందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.

దాతల సహకారం, వైద్య నిపుణుల సేవలు, ప్రభుత్వ ఆరోగ్య పథకాల సమన్వయంతో ఈ సంస్థ క్యాన్సర్‌పై పోరాటంలో కీలక పాత్ర పోషిస్తోంది. 25 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ బసవతారకం ఆస్పత్రి రజతోత్సవ వేడుకలను హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవోటెల్‌లో నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు, వైద్య నిపుణులు, దాతలు, ఆస్పత్రితో అనుబంధం ఉన్న వ్యక్తులు హాజరుకానున్నారు. క్యాన్సర్ బాధితులకు వైద్యం మాత్రమే కాదు.. ధైర్యం, నమ్మకం, మానవత్వాన్ని అందిస్తున్న బసవతారకం ఆస్పత్రి తన 25 ఏళ్ల ప్రయాణంతో సేవే గొప్ప వైద్యం అని నిరూపించింది.

Be the first to react

More Coverage