Chandrababu: రాష్ట్ర ఆర్థిక వృద్ధికి బ్యాంకులు సహకరించాలి.. ఎస్ఎల్బీసీ సమావేశంలో 2026-27 వార్షిక రుణ ప్రణాళికపై సమీక్ష!
Chandrababu: రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగంగా సాగేందుకు బ్యాంకులు తమ వంతు సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు.
ఏపీలో రుణ వితరణ 137 శాతం.. దక్షిణాదిలో ముందంజలో రాష్ట్రం..
2025-26లో వ్యవసాయ రంగానికి రూ.3.86 లక్షల కోట్ల రుణాలు: బ్యాంకర్లు..
అమరావతి: రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగంగా సాగేందుకు బ్యాంకులు తమ వంతు సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. సచివాలయంలోని 5వ బ్లాక్లో ఆయన అధ్యక్షతన జరిగిన 235వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశంలో బ్యాంకర్లతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళికపై చర్చ జరిగింది. వ్యవసాయ రంగం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME), స్వయం సహాయక సంఘాలు, కౌలు రైతులకు అందుతున్న రుణాలపై సీఎం సమీక్షించారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో వివిధ రంగాలకు బ్యాంకులు అందించిన రుణాల వివరాలను సమావేశంలో అధికారులు వెల్లడించారు. వ్యవసాయ రంగానికి రూ.3,86,249 కోట్ల మేర రుణాలు అందించినట్లు బ్యాంకర్లు తెలిపారు. అలాగే ఎంఎస్ఎంఈ రంగానికి రూ.1,17,357 కోట్లు, ప్రాధాన్యతా రంగాలకు రూ.5,19,693 కోట్ల రుణాలు అందించినట్లు వివరించారు.
దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో రుణాల పంపిణీ మెరుగ్గా ఉందని బ్యాంకర్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో రుణ వితరణ స్థాయి 137 శాతంగా ఉన్నట్లు తెలిపారు.
రైతులు, వ్యాపారులు, యువత, చిన్న పరిశ్రమలకు అవసరమైన ఆర్థిక సహాయం అందేలా బ్యాంకులు మరింత చురుగ్గా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి బ్యాంకింగ్ రంగం కీలక భాగస్వామిగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈఓ ఆశీష్ పాండే, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ నీలమ్ అగ్రవాల్, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ ఏఓ బషీర్, నాబార్డ్ జీఎం కేవీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
Tags
Be the first to react