Minister Anam: ఆత్మకూరు అభివృద్ధికి రూ.14.90 కోట్ల అమృత్ 2.0 పనులకు శ్రీకారం!
Minister Anam: ఆత్మకూరు మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు పర్యటనలో భాగంగా పేరారెడ్డిపల్లి వద్ద అమృత్ 2.0 పథకం కింద రూ.14.90 కోట్ల విలువైన అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు.
తాగునీరు, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి..
ఆత్మకూరులో రూ.8.98 కోట్లతో నీటి సరఫరా అభివృద్ధి పనులు ప్రారంభం..
ఆత్మకూరు: ఆత్మకూరు మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు పర్యటనలో భాగంగా పేరారెడ్డిపల్లి వద్ద అమృత్ 2.0 పథకం కింద రూ.14.90 కోట్ల విలువైన అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు.
ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు అందించేందుకు రూ.8.98 కోట్లతో చేపట్టనున్న నీటి సరఫరా అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా 2.0 ఎంఎల్డీ సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రం (WTP), 750 కిలోలీటర్ల సామర్థ్యంతో GLSR నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1,500 గృహాలకు కొత్త తాగునీటి కనెక్షన్లు అందించేలా ప్రణాళిక రూపొందించారు.
అలాగే బలహీన వర్గాల కాలనీల అభివృద్ధికి రూ.3.87 కోట్లతో మౌలిక వసతుల పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 1,471 గృహాలకు తాగునీటి కనెక్షన్లు కల్పించడంతో పాటు కొత్త పైప్లైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఆత్మకూరు చెరువు పునరుద్ధరణకు రూ.2.10 కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. పట్టణ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ఆత్మకూరు బైపాస్ 4 లైన్ల రహదారి నిర్మాణ పనులు రూ.8 కోట్ల వ్యయంతో జరుగుతున్నాయని మంత్రి ఆనం తెలిపారు. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్ల నిర్మాణానికి మరో రూ.2 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆత్మకూరు మున్సిపాలిటీని వేగంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన తాగునీరు, రోడ్లు, మౌలిక వసతులు కల్పించి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు.
Tags
Be the first to react