Kollu Ravindra: గనుల రంగంలో సంస్కరణలతో ఏపీ ఆదాయానికి కొత్త ఊపు.. మంత్రి కొల్లు రవీంద్ర!
Kollu Ravindra: ఆంధ్రప్రదేశ్‌లో గనుల రంగాన్ని మరింత పారదర్శకంగా, సాంకేతిక ఆధారితంగా మార్చి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్, గనులు & భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
ఉచిత ఇసుక విధానంతో ప్రజలకు ఊరట.. గనుల రంగంలో కీలక సంస్కరణలు..
ఖనిజ సంపద ప్రజల కోసమే.. ఏపీని మైనింగ్ హబ్గా తీర్చిదిద్దుతాం..
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గనుల రంగాన్ని మరింత పారదర్శకంగా, సాంకేతిక ఆధారితంగా మార్చి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్, గనులు & భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సహజ వనరులు కొద్దిమంది ప్రయోజనాలకు కాకుండా ప్రజల సంక్షేమానికి ఉపయోగపడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు.
సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అక్రమ మైనింగ్, ఇసుక దోపిడీ, వ్యవస్థాగత లోపాల కారణంగా గనుల రంగం తీవ్రంగా నష్టపోయిందని ఆరోపించారు. 2019-2024 మధ్య కాలంలో తీసుకున్న విధానాల వల్ల రాష్ట్రానికి సుమారు రూ.19,137 కోట్ల ఆదాయ నష్టం జరిగిందని శ్వేతపత్రం ద్వారా వెల్లడించామని తెలిపారు.
గనుల రంగ పునరుద్ధరణ కోసం ఏపీ మైనర్ మినరల్ పాలసీ-2025ను అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఈ విధానం ద్వారా పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించడంతో పాటు ప్రభుత్వ ఆదాయం పెరిగిందన్నారు. లీజు కాలపరిమితులు పెంచడం, దరఖాస్తు ఆధారిత విధానం తీసుకురావడం వంటి సంస్కరణలు చేపట్టామని తెలిపారు.
గత రెండేళ్లలో 1,700కు పైగా దరఖాస్తులు రాగా, 172 కొత్త మైనింగ్ లీజులు మంజూరు చేశామని, దీని ద్వారా రూ.172 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. గనుల రంగంలో 262 శాతం వృద్ధి నమోదైందన్నారు.
MMDR చట్టానికి అనుగుణంగా ఖనిజ బ్లాకుల వేలం ప్రక్రియ వేగవంతం చేశామని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 21 ఖనిజ బ్లాకులను వేలం వేసి 11 మైనింగ్ లీజులు, 10 కాంపోజిట్ లైసెన్సులు ఇచ్చామని వెల్లడించారు. దీనివల్ల పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు.
జేఎస్డబ్ల్యూ స్టీల్, వేదాంత, హిందుస్థాన్ జింక్, అంబుజా సిమెంట్స్ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావడం ప్రభుత్వ పారదర్శక విధానాలకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.
గతంలో ఇసుక విధానం వల్ల ప్రజలపై భారీ భారం పడిందని మంత్రి విమర్శించారు. ఈ పరిస్థితిని మార్చేందుకు కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తోందన్నారు.
ఇప్పటివరకు 1.91 కోట్ల మెట్రిక్ టన్నులకు పైగా ఇసుకను ఉచితంగా సరఫరా చేశామని, 412 ఇసుక రీచ్లు, 238 స్టాక్ యార్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. వర్షాకాల అవసరాల కోసం 64 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ నిల్వలు సిద్ధంగా ఉంచామన్నారు. ఈ విధానం వల్ల నిర్మాణ ఖర్చులు తగ్గి సామాన్య ప్రజలు, కాంట్రాక్టర్లు, నిర్మాణ కార్మికులకు ప్రయోజనం కలుగుతోందని వివరించారు.
అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను అరికట్టేందుకు శాటిలైట్ మానిటరింగ్, డ్రోన్ సర్వేలు, GIS మ్యాపింగ్, రియల్ టైమ్ ట్రాకింగ్ వంటి ఆధునిక విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అక్రమాలకు సంబంధించి రూ.3,500 కోట్లకు పైగా డిమాండ్ నోటీసులు జారీ చేశామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
గతంలో సిలికా శాండ్, గ్రానైట్, లేటరైట్ రంగాల్లో జరిగిన అక్రమాలను వెలికితీస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రకాశం జిల్లాలో పరిశీలించిన 154 గ్రానైట్ లీజుల్లో అక్రమాలు గుర్తించిన 23 కేసులకు సంబంధించి రూ.114 కోట్ల డిమాండ్ నోటీసులు ఇచ్చామని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రతి రూపాయి ఆదాయాన్ని వసూలు చేస్తామని స్పష్టం చేశారు.
గనుల శాఖలో పూర్తిస్థాయి డిజిటలైజేషన్కు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. GPS ట్రాకింగ్, CCTVలు, ANPR, ఆన్లైన్ అనుమతులు, డ్రోన్ పర్యవేక్షణ వంటి వ్యవస్థలతో పారదర్శకత పెంచుతున్నామని చెప్పారు. IIT ధన్బాద్కు చెందిన TEXMiN ఫౌండేషన్తో ఒప్పందం కుదుర్చుకుని AI ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీచ్ శాండ్ ఖనిజ సంపదను ఉపయోగించుకుని టైటానియం, రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ పరిశ్రమలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. ఈ రంగంలో రూ.20 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు.
అనంతపురం జిల్లాలోని జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ త్వరలో వాణిజ్య ఉత్పత్తి దశకు చేరుకుంటుందని చెప్పారు. ఇప్పటివరకు నిర్వహించిన అన్వేషణల్లో సుమారు 13 టన్నుల బంగారు నిల్వలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వ సంస్కరణల ఫలితంగా గత ఏడాదితో పోలిస్తే గనుల శాఖ ఆదాయంలో 32 శాతం వృద్ధి వచ్చిందని మంత్రి తెలిపారు. 2025-26లో రూ.3,500 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుందని, ఇప్పటికే లక్ష్యంలో 95 శాతం సాధించామని చెప్పారు.
పారదర్శకత, సాంకేతికత, పెట్టుబడులు, ఉపాధి కల్పన, పర్యావరణ పరిరక్షణ అనే ఐదు అంశాలపై దృష్టి పెట్టి గనుల రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ సమావేశంలో గనుల శాఖ డైరెక్టర్ డబ్ల్యూ.బి. చంద్రశేఖర్, ఏపీఎండీసీ అధికారులు పాల్గొన్నారు.
Tags
Be the first to react