⚡ BREAKING
Andhra Pradesh

Ministe Savitha: నేతన్నలకు గౌరవప్రద జీవనం కల్పించడమే లక్ష్యం.. త్వరలో నేతన్న భరోసా పథకం!

Ministe Savitha: రాష్ట్రంలోని నేతన్నలు, హస్తకళాకారులు ఆర్థికంగా బలపడుతూ గౌరవప్రదమైన జీవనం సాగించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు.

Minister Savitha
Minister Savitha

విదేశాల్లోనూ లేపాక్షి షోరూమ్‌లు ఏర్పాటు.. నేతన్నలకు గౌరవప్రద జీవనం కల్పిస్తాం..

ఆప్కోకు కొత్త ఊపు.. డిజిటలైజేషన్‌కు స్కోచ్ అవార్డు: మంత్రి సవిత..

అమరావతి: రాష్ట్రంలోని నేతన్నలు, హస్తకళాకారులు ఆర్థికంగా బలపడుతూ గౌరవప్రదమైన జీవనం సాగించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని, త్వరలోనే నేతన్న భరోసా పథకాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు.

అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో చేనేత, జౌళి శాఖ రెండేళ్ల ప్రగతిపై నిర్వహించిన సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ.. చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించడంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చూపిన మార్గాన్ని కొనసాగిస్తూ సీఎం చంద్రబాబు నేతన్న సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో టెక్స్‌టైల్స్ రంగ అభివృద్ధి కోసం టెక్స్‌టైల్స్ అప్పారెల్ & గార్మెంట్స్ పాలసీ 2024-29 తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. దీని ద్వారా రూ.10 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, రెండు లక్షల మందికి పైగా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో టెక్స్‌టైల్స్ రంగంలో రూ.4,700 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని, కొన్ని పరిశ్రమలకు భూములు, మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు.

చేనేత కుటుంబాలకు ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీని అమలు చేశామని మంత్రి సవిత తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 50,565 చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకోసం రూ.150 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

చేనేత కార్మికులకు పనిముట్లపై 90 శాతం సబ్సిడీ, గుర్తింపు కార్డుల జారీ, వస్త్రాలకు క్యూఆర్ కోడింగ్ వంటి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నకిలీ వస్త్రాల అమ్మకాలను అరికట్టేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

నేతన్నలకు నిరంతర ఉపాధి కల్పించేందుకు రాష్ట్రంలో క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రూ.10.44 కోట్లతో 10 చిన్న క్లస్టర్లు, ధర్మవరంలో రూ.38.31 కోట్లతో మెగా చేనేత క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

అమరావతిలో చేనేత, హస్తకళల మ్యూజియం, శాఖమూరులో 10 ఎకరాల్లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మంగళగిరి, ఉప్పాడ ప్రాంతాల్లో చేనేత పార్కులకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచేందుకు ఆద్యం, టాటా తనేరియా, కో ఆప్టెక్స్ వంటి సంస్థలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానంతో కూడా ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు.

ఆప్కో షోరూమ్‌లను ఆధునీకరించి, పూర్తిగా చేనేత వస్త్రాల విక్రయాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి చెప్పారు. ఆప్కో డిజిటలైజేషన్‌కు స్కోచ్ అవార్డు-2025 లభించిందని తెలిపారు. గత రెండేళ్లలో ఆప్కో ద్వారా రూ.190 కోట్ల అమ్మకాలు జరిగాయని వెల్లడించారు.

చేనేత వస్త్రాలు, హస్తకళా వస్తువులు ఒకే చోట అందుబాటులో ఉండేలా షోరూమ్‌లను అభివృద్ధి చేస్తున్నామని, లేపాక్షి షోరూమ్‌లను దేశవ్యాప్తంగా ఆధునీకరించడంతో పాటు విదేశాల్లో కూడా ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.

రాష్ట్రంలో 2.05 లక్షల మంది హస్తకళాకారులను గుర్తించామని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆన్‌లైన్ విక్రయాల ద్వారా కూడా హస్తకళలకు మార్కెట్ కల్పిస్తున్నామని చెప్పారు.

ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా కొత్త యూనిట్ల ఏర్పాటు చేసి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్, ఇతర ఉపాధి ఆధారిత కోర్సుల్లో యువతకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.

గత ప్రభుత్వ పాలనలో చేనేత రంగం తీవ్రంగా దెబ్బతిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్నలకు భరోసా కలిగించే విధంగా చర్యలు ప్రారంభించిందని మంత్రి సవిత అన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ ఉన్నతాధికారులు, లేపాక్షి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Be the first to react

More Coverage