Gottipati Ravi: వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాం.. మార్కాపురాన్ని హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతాం.. మంత్రి గొట్టిపాటి రవికుమార్!
Gottipati Ravi: రాష్ట్ర అభివృద్ధితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ పనితీరుపై వివరణ..
మార్కాపురంలో రెండేళ్ల నమ్మకం.. అభివృద్ధి, సంక్షేమ సభ..
రాష్ట్ర అభివృద్ధితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి రెండేళ్ల పాలనలో సాధించిన పురోగతిని వివరించేలా ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను మంత్రులు పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.. గతంలో నిర్లక్ష్యానికి గురైన వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
వెలిగొండ ప్రాజెక్టుపై గత ప్రభుత్వం సరైన దృష్టి పెట్టలేదని ఆరోపించిన మంత్రి.. అవసరమైన నికర జలాల కేటాయింపుల కోసం అప్పట్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు ఢిల్లీలో పోరాడి సాధించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసి పనులను వేగవంతం చేసిందని తెలిపారు.
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టు పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు అభివృద్ధి పనులను కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.
మార్కాపురాన్ని హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆధునిక సాగు విధానాలతో రైతులకు మేలు కలిగించే చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
స్ప్రింక్లర్ విధానం ద్వారా సాగునీటి సౌకర్యాలు మెరుగుపడటంతో పల్నాడు ప్రాంతంలో కూడా పామాయిల్ సాగు విస్తరిస్తోందని మంత్రి తెలిపారు. మార్కాపురం ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని అన్నారు.
రెండేళ్లలో ఎన్నికల హామీల అమలుతో పాటు సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. పేదల పెన్షన్ను పెంచేందుకు గత ప్రభుత్వానికి ఐదేళ్లు పట్టిందని విమర్శించిన ఆయన.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచిందని గుర్తు చేశారు.
దేశంలోనే పెన్షన్ల పంపిణీకి ఏటా రూ.33 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం కింద ఒకేరోజు రూ.10 వేల కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు.
విద్యా రంగంలో భాగంగా డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని అన్నారు. మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు జరగలేదని విమర్శించిన మంత్రి.. ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రతిపక్షాలు తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించేందుకే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం కొనసాగితేనే రాష్ట్ర అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని, పేదలకు సంక్షేమ ఫలాలు మరింతగా అందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, ఆకోశ్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Be the first to react