Chandrababu: ప్రజల నమ్మకం పెంచేందుకు జూలై నుంచి అధికారుల క్షేత్ర పర్యటనలు తప్పనిసరి.. సీఎం చంద్రబాబు ఆదేశాలు!
Chandrababu: ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచేందుకు ప్రతి ప్రభుత్వ అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
జూలై నుంచి వారానికి మూడు రోజులు ఫీల్డ్ విజిట్లు తప్పనిసరి..
ఫిర్యాదుల పరిష్కారానికి పారదర్శక వ్యవస్థ ఏర్పాటు చేయాలి..
అమరావతి: ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచేందుకు ప్రతి ప్రభుత్వ అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. జూలై నుంచి అధికారులు తప్పనిసరిగా ఫీల్డ్ విజిట్లు చేపట్టాలని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు.
సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) ద్వారా వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరిపాలనా వ్యవస్థలో జవాబుదారీతనం, అప్రమత్తత పెరగాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ప్రజలకు సేవలు అందించే విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా అధికారులు వాస్తవ పరిస్థితులను తెలుసుకుని సమస్యలను త్వరగా పరిష్కరించగలరని, దీనివల్ల ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుందని అన్నారు.
జూలై నుంచి ప్రతి అధికారి ఫీల్డ్లోకి వెళ్లాలని, వారానికి మూడు రోజులు క్షేత్రస్థాయి పర్యటనలకు కేటాయించాలని ముఖ్యమంత్రి సూచించారు. జిల్లా కలెక్టర్లు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని నాలుగు సార్లు సందర్శించాలని, నియోజకవర్గ నోడల్ అధికారులు ప్రతి నెలా అదే మండలాన్ని నాలుగు సార్లు పర్యవేక్షించాలని ఆదేశించారు.
అధికారులు, ఉద్యోగుల పనితీరును 360 డిగ్రీల మూల్యాంకన విధానం ద్వారా సమీక్షిస్తామని సీఎం తెలిపారు. ప్రజలకు సేవలందించే విధానంలో నాణ్యత పెంచేందుకు సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఆలయాల్లో భక్తులకు అందించే సేవలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దేవాదాయ శాఖ పనితీరును మరింత బలోపేతం చేయాలని, ఉద్యోగులు తమ నైపుణ్యాలను నిరంతరం పెంచుకోవాలని సూచించారు.
ప్రపంచంలోని ఉత్తమ పరిపాలనా విధానాలను అధ్యయనం చేయాలని సీఎం అన్నారు. ముఖ్యంగా సింగపూర్ అనుసరిస్తున్న ఆధునిక పాలనా విధానాలను పరిశీలించి రాష్ట్రానికి అనువైన వాటిని అమలు చేయాలని సూచించారు.
రోడ్ల నిర్వహణపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిధిలో గుర్తించిన 11,600 గుంతల్లో ఇప్పటికే 79 శాతం మరమ్మతులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాలను అనుసంధానించే రోడ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రోడ్లు, భవనాల శాఖ, మున్సిపల్ పరిపాలన శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
పాలనలో సాంకేతికత వినియోగాన్ని మరింత పెంచాలని సీఎం తెలిపారు. డేటా ఆధారిత పాలన కోసం గూగుల్తో రాష్ట్రం భాగస్వామ్యం చేసుకుంటోందని, వాణిజ్య పన్నుల శాఖలో ఇప్పటికే ఈ సహకారం కొనసాగుతోందని చెప్పారు. ఇతర శాఖల్లో కూడా ఇలాంటి సాంకేతిక సహకారాలను విస్తరించాలని సూచించారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)పై కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రజలు తమ ఫిర్యాదుల స్థితిని స్వయంగా తెలుసుకునేలా పారదర్శక ట్రాకింగ్ విధానం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఫిర్యాదు ఎక్కడ ఉంది, ఎంతవరకు పరిష్కారమైంది అనే వివరాలు ప్రజలకు స్పష్టంగా అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Tags
Be the first to react