ప్రకృతి వ్యవసాయం నుంచి ఆరోగ్య సేవల వరకు.. పల్నాడు అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ..
పల్నాడులో విద్యా–వైద్య విప్లవానికి శ్రీకారం.. అధికారులకు లంకా దినకర్ దిశానిర్దేశం..
నర్సరావుపేట: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయమైన ‘స్వర్ణాంధ్రప్రదేశ్’, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమైన ‘వికసిత్ భారత్’ దిశగా పల్నాడు జిల్లా వేగంగా ముందుకు సాగాలని, విద్యా మరియు వైద్య రంగాల్లో ఆదర్శ జిల్లాగా నిలవాలని 20 సూత్రాల పథకం చైర్పర్సన్ లంకా దినకర్ అన్నారు.
నర్సరావుపేట కలెక్టరేట్లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ డా. కృతిక శుక్లా, జాయింట్ కలెక్టర్ సంజన సిన్హా సమక్షంలో వైద్య ఆరోగ్య, విద్యాశాఖలతో పాటు వీబీజీ రామ్ జీ, అమృత్ 1.0, అమృత్ 2.0, జల్ జీవన్ మిషన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.
ఉపాధి హామీ పథకం కింద నిజమైన కూలీలకు ప్రయోజనం కల్పించేందుకు పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచినట్లు తెలిపారు. రైతులకు కూలీల కొరత లేకుండా మరో 60 రోజుల మినహాయింపుతో మొత్తం 185 రోజుల వరకు ఉపాధి కల్పించేలా కేంద్రం చర్యలు తీసుకుందని వివరించారు.
పల్నాడు జిల్లాకు అత్యధిక నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవడంతో పాటు భూగర్భ జలాల పెంపు కోసం జలసిరి, మ్యాజిక్ డ్రైన్స్, గ్రామాల డిజిటలైజేషన్, పీఎం గతిశక్తి యోజన పనులను వేగవంతం చేయాలని సూచించారు.
రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు. 2019-25 మధ్య జిల్లాలో 17.41 లక్షల మెట్రిక్ టన్నుల రసాయన ఎరువుల వినియోగంతో భూమి, భూగర్భ జలాలు ప్రభావితమయ్యాయని, ఈ పరిస్థితిని మార్చేందుకు చర్యలు అవసరమన్నారు. జిల్లాలోని 4 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణంలో ఈ ఏడాది 80 వేల ఎకరాలను ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకెళ్లాలని అధికారులకు లక్ష్యంగా పెట్టారు.
సాగర్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, భూగర్భ జలాల కాలుష్య సమస్యకు జల్ జీవన్ మిషన్ ద్వారా పరిష్కారం చూపాలని చెప్పారు. బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా నల్లమల్ల సాగర్ అనుసంధానం దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. వరికెపుడిసెల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వెల్దుర్తి, దుర్గి, మాచర్ల, కారెంపూడి మండలాలకు సాగునీరు అందించేందుకు రూ.63.14 కోట్లతో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు.
జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి పల్నాడును ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దాలని లంకా దినకర్ పేర్కొన్నారు.
అనీమియా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా కిషోర బాలికలు, గర్భిణీలకు పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 3,527 మంది బాలికలను పరీక్షించగా 1,947 మందిలో, 11,895 మంది గర్భిణీలలో 4,089 మందిలో రక్తహీనత గుర్తించామని, వారికి పోషకాహారం, మందులు అందిస్తున్నామని చెప్పారు.
ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ ద్వారా గర్భిణీలకు ప్రతి 15 రోజులకు ఒకసారి స్కాన్లు, రక్తపరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి నెల 9, 10 తేదీల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో గైనకాలజిస్టుల సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
గత ఏడాది జిల్లాలో 29,708 ప్రసవాలు జరిగాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన వారికి జననీ సురక్షా యోజన, సుఖీభవ ద్వారా రూ.1,000 ఆర్థిక సహాయం అందిస్తున్నామని వివరించారు.
జననీ శిశు సంరక్ష కార్యక్రమం కింద ఉచిత ఆహారం, మందులు, పరీక్షలకు రూ.70.64 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. కాయకల్ప కార్యక్రమంలో భాగంగా గ్రామీణ, పట్టణ ఆరోగ్య కేంద్రాలకు నాణ్యత ప్రమాణాల సర్టిఫికెట్లు సాధించామని వెల్లడించారు.
జిల్లాలో శిశు మరణాల రేటు రాష్ట్ర సగటు కంటే మెరుగ్గా 7గా ఉండగా, మాతృ మరణాల రేటు 40గా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసి తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రధాన మంత్రి మాతృ వందన యోజన ద్వారా మొదటి కాన్పుకు రూ.5,000, ప్రభుత్వ కేంద్రంలో ప్రసవం అయితే అదనంగా రూ.1,000, రెండో కాన్పులో ఆడ శిశువు పుడితే రూ.6,000 ప్రోత్సాహకం అందిస్తున్నామని తెలిపారు.
370 పాఠశాలల్లో 69,254 మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి 3,815 మందికి ఉచిత కళ్లజోళ్లు పంపిణీ చేశామని చెప్పారు. ఈ ఏడాది 1.40 లక్షల మంది విద్యార్థులకు ఐ, హెల్త్ స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
రూ.27 కోట్లతో 95 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర భవనాలు మంజూరు కాగా 30 పూర్తయ్యాయని, మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు.
జిల్లాలోని ఆసుపత్రుల్లో గత ఏడాది 12.57 లక్షల మంది ఓపీ సేవలు పొందారని, 1,485 మంది ఆశా వర్కర్లకు నెలకు రూ.10 వేల చొప్పున వేతనాలు అందుతున్నాయని తెలిపారు.
ఆయుష్మాన్ భారత్ కింద లక్షలాది మందికి నమోదు, పరీక్షలు, మందుల పంపిణీ జరుగుతోందని, అర్హులైన వృద్ధులకు ఆరోగ్య కార్డులు అందించేందుకు అధికారులు ఇంటింటికీ వెళ్లాలని ఆదేశించారు.
108 సేవల స్పందన సమయాన్ని 30-45 నిమిషాల నుంచి 20 నిమిషాల్లోపు తీసుకురావాలని సూచించారు. 104, 102 సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పారు.
పల్నాడు జిల్లాలో 1,521 ప్రభుత్వ పాఠశాలల్లో 1.39 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, 7,970 మంది ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో కూడా పెద్ద సంఖ్యలో విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని చెప్పారు.
బేటీ బచావో బేటీ పడావో ద్వారా బాలికల విద్యపై అవగాహన కల్పిస్తున్నామని, తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన విద్యార్థులకు ఏడాదికి రూ.15 వేల సహాయం అందిస్తున్నామని తెలిపారు.
పీఎం పోషణ్ పథకం ద్వారా 1,521 పాఠశాలల్లో 78 వేల మంది విద్యార్థులకు వారానికి ఐదు రోజులు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని చెప్పారు. దీనివల్ల డ్రాపౌట్లు తగ్గుతున్నాయని వివరించారు.
సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా 1.42 లక్షల మంది విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాంలు, షూలు తదితర సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.
మన బడి - మన భవిష్యత్తు - పీఎం శ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో రూ.7.09 కోట్లతో పనులు పూర్తి చేశామని చెప్పారు. 2026-27లో 484 మోడల్ ప్రైమరీ పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో 7,275 మంది బాలికలు చదువుతూ 90 శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు.
పల్నాడు భవిష్యత్ తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని జల్ జీవన్ మిషన్, అమృత్ పథకాల ద్వారా నర్సరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట, మాచర్ల మున్సిపాలిటీలకు దీర్ఘకాలిక నీటి వనరులు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
పీఎం సూర్యఘర్ పథకం అమలులో వేగం పెంచాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పల్నాడును అభివృద్ధిలో ముందంజలో నిలపాలని లంకా దినకర్ పిలుపునిచ్చారు.
Tags
Be the first to react