రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ విభజనతో తిరుచానూరుకు కొత్త కార్యాలయం..
భూ రీ-సర్వే 2.0తో పారదర్శక భూ పాలనకు ప్రభుత్వం శ్రీకారం..
తిరుపతి: తిరుపతి ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలను మరింత సులభతరం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని విభజించి తిరుచానూరులో ఏర్పాటు చేసిన నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, చిత్తూరు ఎంపీ దుగ్గుమల్ల ప్రసాదరావు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా, సౌకర్యవంతంగా అందించాలనే లక్ష్యంతో కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పెరుగుతున్న రిజిస్ట్రేషన్ లావాదేవీలు, ఆర్థిక కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ప్రాంతాల్లో సేవల విస్తరణ చేపడుతున్నట్లు చెప్పారు.
తిరుచానూరులోని పాత సచివాలయ భవనాన్ని ఆధునీకరించి తాత్కాలికంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంగా మార్చామని మంత్రి వివరించారు. భవిష్యత్తులో శాశ్వత భవనాన్ని నిర్మించి ఆధునిక సాంకేతిక సదుపాయాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు రానున్న రెండేళ్లలో శాశ్వత భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
భూ రీ-సర్వే 2.0 కార్యక్రమంపై మంత్రి మాట్లాడుతూ గతంలో భూ సర్వేల్లో ఎదురైన సమస్యలకు పరిష్కారం చూపుతూ ప్రభుత్వం పారదర్శక విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పట్టాదారుడికి పూర్తి సమాచారం అందించి, వారి సమ్మతి తీసుకున్న తర్వాతే సర్వే ప్రక్రియ పూర్తి చేస్తున్నామని చెప్పారు.
వాట్సాప్ గ్రూపులు, స్థానిక రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షణ, ఈ-కేవైసీ ధృవీకరణ వంటి విధానాల ద్వారా భూ వివరాలను ఖచ్చితంగా నమోదు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామసభలు, రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన సుమారు 7.5 లక్షల ఫిర్యాదులు, దరఖాస్తులను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
భూ వివాదాలు, 22-ఏ భూముల సమస్యలు, కోర్టుల్లో ఉన్న కేసులను చట్టపరమైన విధానాల ద్వారా పరిష్కరించి ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు.
తిరుచానూరు ప్రాంతంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు అభివృద్ధి పనులకు కూడా మంత్రి శ్రీకారం చుట్టారు. తాజ్ సర్కిల్ నుంచి శ్రీనివాసపురం వాటర్ ట్యాంక్ వరకు నిర్మించనున్న శాశ్వత పైప్లైన్ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ పైప్లైన్ పూర్తయితే స్థానిక ప్రజలకు తాగునీటి సరఫరా మరింత మెరుగుపడుతుందని తెలిపారు.
అలాగే మార్కెట్ యార్డ్ నుంచి తాజ్ సర్కిల్ వరకు నిర్మించిన సీసీ రోడ్డు, మురుగు కాలువలను మంత్రి ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ పనులు రవాణా సౌకర్యాలు, పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరచడంలో సహాయపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, జిల్లా రిజిస్ట్రార్ రామ్కుమార్, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తిరుచానూరులో ప్రారంభమైన కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా ప్రజలకు సమయం ఆదా కావడంతో పాటు రిజిస్ట్రేషన్ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి.
Tags
Be the first to react