కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు తవ్వకాల ప్రాజెక్టు ప్రారంభం – భారీ పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలకు మార్గం..
రాయలసీమ అభివృద్ధికి గ్రోత్ ఇంజన్గా జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు..
జొన్నగిరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సువర్ణ అధ్యాయం ప్రారంభమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరిలో ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమకు తిరిగి పూర్వ వైభవం వస్తుందని సీఎం పేర్కొన్నారు.
జియో మైసూర్ – డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థలు రూ.405 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టులో బంగారం తవ్వకం, శుద్ధి, ఉత్పత్తి ప్రక్రియలను సీఎం పరిశీలించారు. ప్లాంట్ విస్తరణలో భాగంగా రెండో యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బంగారు ఖనిజంతో కూడిన మట్టిని తరలించే భారీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.
జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్లో మొదటి దశలో ఏడాదికి 400 కిలోల బంగారం ఉత్పత్తి ప్రారంభమవుతుందని, తర్వాత 900 కిలోలు, భవిష్యత్తులో 2 టన్నుల వరకు ఉత్పత్తి చేసే లక్ష్యంతో ప్రాజెక్టు ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాయలసీమను గతంలో “రతనాల సీమ”గా పిలిచేవారని గుర్తు చేశారు. జొన్నగిరికి చారిత్రకంగా “సువర్ణగిరి” అనే పేరు ఉందని, ఇప్పుడు ఈ ప్రాంతానికి మళ్లీ ఆ పేరు సార్థకం అవుతుందని అన్నారు. జొన్నగిరిని ఇకపై స్వర్ణగిరిగా అభివృద్ధి చేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో పండని పంటలు లేవని, దొరకని ఖనిజాలు లేవని సీఎం పేర్కొన్నారు. బంగారం మాత్రమే కాకుండా రాష్ట్రంలో బెరైటీస్, లైమ్ స్టోన్, యురేనియం, గ్రానైట్, మైకా, సిలికా వంటి ఎన్నో సహజ వనరులు ఉన్నాయని తెలిపారు. ఈ వనరులను ఆధారంగా చేసుకుని పరిశ్రమలు తీసుకురావడం ద్వారా యువతకు స్థానికంగానే ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ను అభివృద్ధికి “గ్రోత్ ఇంజిన్”గా మారుస్తామని సీఎం తెలిపారు. బంగారాన్ని బయటకు పంపకుండా ఇక్కడే ఆభరణాల తయారీ కోసం ప్రత్యేకంగా జ్యుయలరీ పార్కును ఏర్పాటు చేస్తామని చెప్పారు. భద్రత, అవసరమైన అనుమతులు కల్పించి పరిశ్రమను మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
రాయలసీమ అభివృద్ధిలో సాగునీటి ప్రాజెక్టులు కీలకమని సీఎం తెలిపారు. గత రెండేళ్లలో సీమలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.12,484 కోట్లు ఖర్చు చేశామని, తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీనీవా వంటి ప్రాజెక్టుల ద్వారా ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు.
అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఆర్థిక సాయం, పింఛన్ల పంపిణీ, తల్లికి వందనం వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. ఉద్యోగుల ప్రయోజనాల కోసం సీపీఎస్ నుంచి పాత పెన్షన్ విధానానికి మార్పులు తీసుకువచ్చామని తెలిపారు.
ఈ సందర్భంగా జియో మైసూర్ సంస్థ జొన్నగిరిలో ఉత్పత్తి చేసిన బంగారంతో తయారు చేసిన ఏపీ మ్యాప్ను ముఖ్యమంత్రికి అందించింది. దీనిని అమరావతిలో ఏర్పాటు చేయనున్న మ్యూజియంలో ప్రదర్శిస్తామని సీఎం తెలిపారు.
జొన్నగిరిలో ఉత్పత్తి అయ్యే బంగారాన్ని రాష్ట్రంలోని జ్యుయలరీ వ్యాపారులకే విక్రయిస్తామని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. స్థానిక ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాసవీ జ్యుయలర్స్, సాయి సంతోష్ జ్యుయలర్స్ తదితర సంస్థలకు తొలి బంగారాన్ని సీఎం అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Tags
Be the first to react