- జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Politics: జూలై 3న కడప స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటన..
chandrababu: ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ మాత్రమే కాదని, అది అపారమైన ఖనిజ సంపద కలిగిన రత్నగర్భ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. మన రాష్ట్రంలో పండని పంటలు లేవు, దొరకని విలువైన ఖనిజాలు లేవని స్పష్టం చేస్తూ, ఈ సహజ సంపదనంతటినీ సాంకేతికతతో సద్వినియోగం చేసుకొని రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బంగారు గనుల వెలికితీత (గోల్డ్ మైనింగ్) ప్రాజెక్టు ప్రారంభంతో నవ్యాంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో ఒక సువర్ణాధ్యాయం మొదలైందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా వెనుకబాటుతనానికి గురైన రాయలసీమ ప్రాంతానికి ఈ భారీ ప్రాజెక్టు ద్వారా పునర్వైభవం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జొన్నగిరిలో విస్తృతంగా పర్యటించారు. జియో మైసూర్ మరియు డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థలు సంయుక్తంగా సుమారు వందల కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ఆయన అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ప్లాంట్ విస్తరణలో భాగంగా రెండో యూనిట్ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన అనంతరం, బంగారం శుద్ధి ప్రక్రియ కోసం ఖనిజంతో కూడిన మట్టిని తరలించే భారీ మైనింగ్ వాహనాలకు (టిప్పర్లకు) జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో రాయలసీమను మళ్లీ రతనాల సీమగా తయారు చేస్తామని తాము ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చాక నిలబెట్టుకుంటున్నామని, ఈ బృహత్తర ప్రణాళిక స్వర్ణగిరి నుంచే ప్రారంభమైందని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో దేశమంతా కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) తరహాలోనే ఈ 'స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్' గురించే మాట్లాడుకునేలా దీనిని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
ఈ అంతర్జాతీయ స్థాయి గోల్డ్ మైన్ ప్రాజెక్టుతో ఇక్కడి స్థానిక ప్రజల, రైతుల జీవితాలు స్వర్ణమయం కావాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి, మైనింగ్ పరిధిలోకి వచ్చే జొన్నగిరి గ్రామాన్ని ప్రభుత్వం తరఫున దత్తత తీసుకుని అన్ని మౌలిక వసతులతో 'స్వర్ణగిరి మోడల్ విలేజ్'గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారతదేశం ఏటా సుమారు 800 కిలోల బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని, దానికి ప్రత్యామ్నాయంగా ఈ ప్లాంట్ ద్వారా తొలి ఏడాది 400 కిలోలతో ఉత్పత్తి ప్రారంభించి, భవిష్యత్తులో ఏకంగా 50 మెట్రిక్ టన్నుల మార్కెట్ లక్ష్యానికి చేరుకుంటామని స్పష్టం చేశారు. దీనివల్ల దేశానికి విదేశీ మారక నిల్వలు ఆదా అవ్వడమే కాకుండా, స్థానిక రాయలసీమ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఇక్కడ శుద్ధి చేసిన బంగారాన్ని సురక్షితంగా తరలించడం కోసం గనుల ప్రాంతం నుంచే నేరుగా ఎయిర్పోర్టుకు ప్రత్యేక హెలికాప్టర్ సేవలు ఏర్పాటు చేస్తామని, అలాగే మహిళలకు ఉపాధి కల్పించేలా ఇక్కడే ఒక అంతర్జాతీయ జ్యువెలరీ పార్కును కూడా త్వరలోనే నెలకొల్పుతామని వరాల జల్లు కురిపించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అపారమైన సహజ వనరుల విప్లవాన్ని వివరిస్తూ, వైఎస్సార్ కడప జిల్లాలోని మంగంపేట బెరైటీస్, కడప సున్నపురాయి, యురేనియం నిల్వలు, విశాఖ ఏజెన్సీలో ఉన్న బాక్సైట్, ప్రకాశం జిల్లా చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్, చిత్తూరు జిల్లా కుప్పంలో దొరికే గ్రీన్ గ్రానైట్, శ్రీకాకుళంలో బ్లూ గ్రానైట్, నెల్లూరు జిల్లా గూడూరు మైకా, సిలికా నిల్వలు, ఉత్తరాంధ్ర తీరంలో లభించే అత్యంత విలువైన బీచ్ శాండ్, అనంతపురం, కడప జిల్లాల్లోని ఐరన్ ఓర్ (ఇనుప ఖనిజం), కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్లో ఉన్న గ్యాస్, పెట్రోల్ వంటి అపార ఖనిజ సంపద మన రాష్ట్ర సొంతమని గుర్తుచేశారు. ఈ వనరులను కేవలం ముడి పదార్థాలుగా కాకుండా, వాటికి విలువ జోడించే (వాల్యూ ఎడిషన్) అనుబంధ పరిశ్రమలను రాష్ట్రంలో భారీగా ప్రోత్సహిస్తున్నామని, దీనివల్ల యువతకు సొంత జిల్లాల్లోనే ఐటీ, పారిశ్రామిక రంగాల్లో స్థానికంగానే మంచి వేతనాలతో కూడిన ఉపాధి లభిస్తుందని అన్నారు.
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అనుసరించిన తప్పుడు విధానాల వల్ల భయపడి పలు అంతర్జాతీయ పరిశ్రమలు రాష్ట్రం విడిచి బయటకు వెళ్లిపోయాయని, కానీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ 'ట్రస్ట్ బ్రాండ్' మరియు పారదర్శకతను చూసి పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నారని చంద్రబాబు తెలిపారు. రాయలసీమలోని ప్రతి జిల్లాను విడివిడిగా పారిశ్రామిక హబ్గా అభివృద్ధి చేస్తున్నామని, ఇందులో భాగంగానే కర్నూలులో దేశంలోనే అతిపెద్ద డ్రోన్ సిటీతో పాటు ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్ను వేగంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అలాగే అనంతపురం జిల్లాలో ప్రతిష్టాత్మక 5వ తరం ఫైటర్ జెట్ల తయారీ ప్రాజెక్టు, వైఎస్సార్ కడప జిల్లాలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న రాయలసీమ స్టీల్ ప్లాంట్కు రాబోయే జులై 3వ తేదీన శంకుస్థాపన చేయబోతున్నామని, తిరుపతిలో ప్రసిద్ధ రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్ల పరిశ్రమ వంటి భారీ ప్రాజెక్టులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. తాను కూడా ఈ రాయలసీమ మట్టిలోనే పుట్టిన సీమ బిడ్డనని, ఈ వెనుకబడిన ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి రతనాల సీమగా మార్చి తీరుతానని సగర్వంగా ప్రకటించారు. స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ నుంచి నవ్యాంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో ఒక సరికొత్త రికార్డుల చరిత్ర ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు మరియు వేలాదిగా తరలివచ్చిన స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Be the first to react