గురుకులాలు, ఉచిత శిక్షణతో బీసీ యువతకు బంగారు భవిష్యత్..
బీసీ బిడ్డల ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగాలే ప్రభుత్వ లక్ష్యం..
అమరావతి: సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న బీసీ వర్గాలను రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. బీసీల సంక్షేమానికి గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు కేటాయిస్తూ, విద్య నుంచి ఉపాధి వరకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఆమె వెల్లడించారు.
అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ రెండేళ్ల ప్రగతిపై నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. బీసీలు సమాజానికి వెన్నెముక అని సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తారని, అందుకే వారి అభ్యున్నతికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్లలో బీసీ సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించామని మంత్రి తెలిపారు. మొదటి బడ్జెట్లో రూ.39 వేల కోట్లు, రెండో బడ్జెట్లో రూ.47 వేల కోట్లు, మూడో బడ్జెట్లో రూ.51 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత పెద్ద మొత్తంలో బీసీ సంక్షేమానికి నిధులు కేటాయించలేదన్నారు.
బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు గురుకుల వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 109 బీసీ గురుకులాలు ఉన్నాయని, కొత్తగా మరో 10 గురుకులాలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.
రూ.500 కోట్లతో ఎంజేపీ గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మించనున్నట్లు వెల్లడించారు. కొత్తగా ఏర్పాటు చేసే గురుకులాల ద్వారా మరో 5 వేల మంది విద్యార్థులకు విద్యా అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
పదో తరగతి తర్వాత చదువు ఆపేసే బాలికల సంఖ్య తగ్గించేందుకు ఆరు బాలికల గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తున్నామని, దీని ద్వారా 960 మంది విద్యార్థినులు ఉన్నత విద్య కొనసాగించే అవకాశం పొందుతారని చెప్పారు.
బీసీ విద్యార్థులకు ఐఐటీ, నీట్ ప్రవేశాల కోసం ప్రత్యేక శిక్షణ అందించేందుకు శ్రీసత్యసాయి జిల్లా టేకులోడు, విశాఖలోని సింహాచలం ఎంజేపీ గురుకులాల్లో ఎక్స్లెన్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
గత ఏడాది ట్రిపుల్ ఐటీకి 302 మంది బీసీ గురుకుల విద్యార్థులు ఎంపికయ్యారని, ఈ ఏడాది ఇప్పటికే 275 మంది ఎంపికయ్యారని చెప్పారు.
గతంలో నిలిచిపోయిన గుడిబండ, గుండుమల, పులివెందుల, రొద్దం గురుకుల భవనాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.30 కోట్లతో పూర్తి చేశామని తెలిపారు. 62 ఎంజేపీ భవనాల మరమ్మతులకు రూ.26.71 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.
బీసీ విద్యార్థుల వసతి గృహాలను సొంతింటి మాదిరిగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి సవిత తెలిపారు. రాష్ట్రంలోని 998 బీసీ హాస్టళ్లలో 85 వేల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారని చెప్పారు. తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణలో హాస్టళ్ల నిర్వహణపై ఎక్కువ మంది సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.
గత ప్రభుత్వంలో హాస్టళ్ల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ డైట్ బిల్లులను చెల్లించడంతో పాటు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచామని చెప్పారు.
రెండేళ్లలో రూ.80 కోట్లతో హాస్టల్ భవనాల మరమ్మతులు చేశామని, రూ.6 కోట్లతో దోమతెరలు, రూ.18 కోట్లతో వంట సామగ్రి, రూ.16.85 కోట్లతో 772 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 642 హాస్టళ్లలో ఇన్వర్టర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, పారిశుధ్యం కోసం 1,291 మంది సిబ్బందిని నియమిస్తున్నామని చెప్పారు.
బీసీ యువత ఉన్నత ఉద్యోగాలు సాధించాలన్న ఉద్దేశంతో సివిల్ సర్వీసెస్, డీఎస్సీ, ఇతర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి ఏడాది 100 మంది బీసీ అభ్యర్థులకు సివిల్స్ శిక్షణ ఇస్తున్నామని, ఉచిత వసతి, భోజన సదుపాయాలు కూడా కల్పిస్తున్నామని చెప్పారు.
మెగా డీఎస్సీ కోసం ఆన్లైన్, ఆఫ్లైన్ ఉచిత శిక్షణ అందించామని, దీని ద్వారా 280 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారని తెలిపారు. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల కోసం విశాఖపట్నం, అనంతపురం, తిరుపతిలో ప్రత్యేక బీసీ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
బీసీలకు శాశ్వత ఉపాధి కల్పించే లక్ష్యంతో రూ.1,000 కోట్లతో ఆదరణ 3.0 పథకం అమలు చేయనున్నామని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా ఆధునిక పనిముట్లు అందించి బీసీలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో పరిశ్రమల స్థాపనకు బీసీలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. బీసీలకు రాజకీయంగా మరింత ప్రాతినిధ్యం కల్పించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి తెలిపారు.
చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని చెప్పారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని, స్థానిక సంస్థల్లో కూడా 34 శాతం రిజర్వేషన్ల కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బీసీల ఆత్మగౌరవం, రక్షణ కోసం బీసీ రక్షణ చట్టం-2026 తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ భవనం నిర్మించనున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే కర్నూలు, ఏలూరు, నెల్లూరులో భవనాలకు నిధులు మంజూరు చేశామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.10 కోట్లతో 48 బీసీ కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు.
బీసీ కార్పొరేషన్ ద్వారా రెండేళ్లలో వివిధ పథకాల కింద 117.68 లక్షల మంది బీసీ లబ్ధిదారులకు రూ.32,533.68 కోట్లు అందించామని మంత్రి తెలిపారు. ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కూడా రూ.19,429.38 కోట్లు అందించామని చెప్పారు. స్వర్ణకారులు, గీత కార్మికులు, వడ్డెరలు, మత్స్యకారులు, నాయీ బ్రాహ్మణులు, నేతన్నల కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామని వివరించారు.
మత్స్యకారుల సాయం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచామని, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ పరిమితిని పెంచామని, నేతన్నలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు, అక్రమాలపై చట్టం తన పని చేస్తుందని మంత్రి సవిత స్పష్టం చేశారు.
బీసీలపై అన్యాయం జరిగిందని, అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. కులాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బీసీల అభ్యున్నతి, ఆత్మగౌరవం, సమాన అవకాశాల కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని మంత్రి సవిత పేర్కొన్నారు.
Tags
Be the first to react