రాజధాని అమరావతిలో ఆరోగ్యరంగానికి సంబంధించిన మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ప్రారంభం కానుంది. 'ఎపెక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా & నేచురోపతి' అనే భారీ స్థాయి ఆరోగ్య, పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి AP ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సంస్థ నిర్మాణానికి మొత్తం రూ.750 కోట్ల భారీ పెట్టుబడి ఖర్చు చేయనున్నట్లు అధికారిక సమాచారం. దీని కోసం అమరావతిలో 40 ఎకరాల భూమిని త్వరలోనే కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇది పూర్తయితే రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా యోగా, నేచురోపతి రంగాల్లో అత్యున్నత సదుపాయాలు కలిగిన ప్రథమ ఇన్స్టిట్యూట్‌గా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
ఈ ఇన్స్టిట్యూట్‌లో అత్యాధునిక సదుపాయాలతో 450 పడకల నేచురోపతి సూపర్-స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు కానుంది. ప్రత్యేక ఆయుర్వేద, నేచురోపతి, ఆక్యుప్రెషన్, పంచకర్మ చికిత్సలు, డీటాక్స్ థెరపీలు, ఆధునిక వైద్యపరీక్షలు వంటి సర్వీసులు ఒకే చాట్రం కింద అందుబాటులోకి రానున్నాయి. రోగులకు మందుల మీద ఆధారపడకుండా సహజ చికిత్సల ద్వారా శరీర, మానసిక ఆరోగ్యాలను కాపాడటమే ఈ ఆసుపత్రి ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా డయాబెటిస్, బ్లడ్ ప్రెజర్, ఒబెసిటీ, స్ట్రెస్, ఆస్తమా వంటి లైఫ్‌స్టైల్ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇది గొప్ప వరంగా మారే అవకాశం ఉంది.
ఇక విద్యారంగానికి సంబంధించి కూడా ఈ సంస్థ ప్రత్యేక అవకాశాలను కల్పించనుంది. యోగా, నేచురోపతి విద్యలో 100 అండర్ గ్రాడ్యుయేట్ (UG) సీట్లు, 20 పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) సీట్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ కోర్సులు పూర్తిచేసే విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న హై లెవల్ వెల్‌నెస్ సెంటర్లు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు, మెడికల్ విశ్వవిద్యాలయాల్లో ఉపాధి అవకాశాలను పొందవచ్చు. పైగా ఇక్కడ ప్రత్యేక రీసెర్చ్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి, సహజ చికిత్సా పద్ధతులపై శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు. భవిష్యత్తులో విదేశీ విద్యార్థులు కూడా ప్రవేశం పొందే అవకాశం ఉందని సమాచారం.
అమరావతిని ఆరోగ్య, వైద్య, క్రీడా రంగాలకు గ్లోబల్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ ఇన్స్టిట్యూట్ కీలక పాత్ర పోషించనుంది. ఇప్పటికే క్రీడా నగరం, అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టం, క్వాంటం మిషన్ వంటి మెగా ప్రాజెక్టులు ప్రకటించిన నేపథ్యంలో యోగా-నేచురోపతి సంస్థ మరో పెద్ద అడుగుగా నిలుస్తోంది. అమరావతి ప్రజలతో పాటు మొత్తం రాష్ట్రానికి ఇది ఆరోగ్య పరంగా గొప్ప వరం కానుందని అధికారులు పేర్కొంటున్నారు. నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.