అమరావతిని భవిష్యత్ టెక్నాలజీల కేంద్రంగా తీర్చిదిద్దే పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగాన్ని పెంచింది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న క్వాంటం టెక్నాలజీ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద స్థాయిలో ప్రణాళికలు రూపొందించింది. ఈ క్రమంలో ‘అమరావతి క్వాంటం మిషన్’ పేరుతో ఒక విశేషమైన కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. టెక్నాలజీ ప్రగతిలో అత్యంత కీలకమైన క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషಲ್ ఇంటెలిజెన్స్ రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా దీనిని తెరకెక్కించారు.
ఈ కార్యక్రమానికి భాగస్వామ్య సంస్థలుగా WISER మరియు Qubitech ముందుకు వచ్చాయి. మొత్తంగా 50 వేల మంది విద్యార్థులు, ఐటీ నిపుణులు, రీసెర్చ్ స్కాలర్లు మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులకు శిక్షణ అందించనున్నారు. శిక్షణ కార్యక్రమం డిసెంబర్ 8న ప్రారంభం కానుంది. ఈ ప్రోగ్రామ్ రెండు దశల్లో జరుగుతుంది. ఫేజ్–1లో ఫౌండేషన్ కోర్సు ఉంటుంది. దీనికి ఫీజు కేవలం ₹500 మాత్రమే. క్వాంటం సైన్స్ ప్రాథమిక అంశాలు, భవిష్యత్ అవకాశాలు, పరిశ్రమల్లో వినియోగాలు వంటి విషయాలను ఇందులో బోధిస్తారు.
ఫేజ్–1లో ప్రతిభ కనబరిచిన టాప్ 3,000 మంది విద్యార్థులను ఎంపిక చేసి, ఫేజ్–2లో అడ్వాన్స్డ్ శిక్షణను పూర్తిగా ఉచితంగా అందించనున్నారు. పరిశ్రమ నిపుణులు, అంతర్జాతీయ ట్రైనర్లు, డొమైన్ స్పెషలిస్టులు శిక్షణ అందించనున్నారు. యథార్థ ప్రాజెక్టులు, రీసెర్చ్ అసైన్‌మెంట్లు, లైవ్ ల్యాబ్ సెషన్లు కూడా ఇందులో భాగం కానున్నాయి. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఇంటర్న్‌షిప్‌లు, జాబ్ అవకాశాలు, స్టార్టప్ మార్గదర్శకత్వం కూడా లభించే అవకాశం ఉంది.
ఈ ప్రోగ్రామ్ కేవలం ఆంధ్రప్రదేశ్ వారికి మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా ఎవరికైనా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆన్‌లైన్ మోడ్‌లో కూడా శిక్షణ అందిస్తారు. క్వాంటం టెక్నాలజీ భవిష్యత్‌లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చబోతున్న నేపథ్యంలో, అమరావతిని గ్లోబల్ క్వాంటం హబ్ గా మార్చడం ద్వారా పెట్టుబడులు, స్టార్టప్స్, రీసెర్చ్ సెంటర్లను ఆకర్షించేలా ప్రభుత్వం వ్యూహం రూపొందిస్తోంది.
ఇది అమలు అయితే, అమరావతి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవడంతో పాటు, రాష్ట్ర యువతకు అత్యంత విలువైన ఉద్యోగాలు, స్టార్టప్ అవకాశాలు విస్తృతంగా లభించనున్నాయి. టెక్నాలజీలో నూతన విప్లవానికి ఇది శ్రీకారం చుట్టబోతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్ టెక్ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ గర్వంగా నిలిచే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అంటున్నారు.