చియా సీడ్స్ ఇటీవల ఆరోగ్యాభిమానులలో విస్తృతంగా వినియోగంలోకి వచ్చాయి. చిన్న విత్తనాలే అయినా, వీటిలో ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్స్, కాల్షియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉండటం వలన ఇవి “సూపర్‌ఫుడ్”గా పేరొందాయి. వీటిని సాల్వియా హిస్పానియా అనే మొక్క నుండి పొందుతారు. చాలా మంది రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం తినే అలవాటు ఏర్పరుచుకున్నారు. ముఖ్యంగా పాలలో నానబెట్టి తింటే మరింత పోషకాల ప్రయోజనం లభిస్తుందని పోషక నిపుణులు చెబుతున్నారు.
చియా సీడ్స్‌ను నానబెట్టిన తర్వాత తినడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి నీటిని అధికంగా గ్రహించగల సామర్థ్యం కలిగి ఉంటాయి. నానబెట్టకుండా తింటే గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం, జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మొదటిసారి తినేవారు తక్కువ పరిమాణంతో ప్రారంభించాలి. సాధారణంగా రోజుకు 1–2 టేబుల్ స్పూన్లు (15–25 గ్రాములు) మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చియా తిన్న తర్వాత తప్పనిసరిగా పుష్కలంగా నీరు తాగాలి, లేకపోతే నిర్జలీకరణకు అవకాశం ఉంటుంది.
చియా సీడ్స్‌లో ఉన్న అధిక ఫైబర్ జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఇది మలబద్ధకం, ఆమ్లత్వం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా, ఇవి శరీరాన్ని చల్లగా ఉంచే లక్షణం కలిగి ఉన్నందున వేసవిలో హైడ్రేషన్‌ను నిలబెట్టడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి ఇవి ఎంతో మంచివి అని వైద్యులు చెబుతున్నారు. రక్తపోటు నియంత్రణ, కొలెస్ట్రాల్ తగ్గింపు, గుండె వ్యాధుల ప్రమాదం తగ్గటంలో చియా సీడ్స్ సానుకూల ప్రభావం కలిగిస్తాయి.
డయాబెటీస్ ఉన్నవారికి ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి, ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెరస్థాయిలను నెమ్మదిగా పెంచుతాయి. అలాగే చియా సీడ్స్‌లోని తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండేందుకు తోడ్పడతాయి. దీనివల్ల బరువు తగ్గాలని భావించే వారికి ఇవి సహాయకంగా మారుతాయి. పుష్కలంగా ఉన్న కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఎముకల బలాన్ని పెంచుతాయి.
అయితే చియా సీడ్స్‌ను అధికంగా తీసుకోవడం ప్రమాదకరం. ఇది కడుపు నొప్పి, విరేచనాలు, గ్యాస్ వంటి సమస్యలు కలిగించవచ్చు. అలెర్జీ ఉన్నవారు వీటిని పూర్తిగా నివారించాలి. రక్తపోటు మందులు వాడేవారు లేదా బ్లడ్ థిన్నర్స్ (వార్ఫరిన్, ఆస్పిరిన్ వంటి) తీసుకునేవారు వైద్యుడి సలహా లేకుండా చియా సీడ్స్ తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనవసరంగా ఎక్కువ తీసుకుంటే పొటాషియం స్థాయిలు పెరిగి హైపర్‌కలీమియా, బ్లీడింగ్ రిస్క్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.