అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండో విడత భూ సమీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలపడం ద్వారా భూ సమీకరణ ప్రక్రియ మళ్లీ మొదలైంది. ఇదే సమయంలో, ముఖ్యమైన నిర్మాణాలకు సీఆర్డీఏ కూడా అనుమతులు జారీ చేసింది. రెండో విడతలో భూములు ఇస్తున్న రైతుల ప్యాకేజీపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. అమరావతికి భారీ రుణం పొందడానికి కూడా ఆమోదం లభించింది.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ప్రధాన ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. రూ.169 కోట్లతో గవర్నర్ భవన్ (లోక్ భవన్) నిర్మాణానికి టెండర్లు పిలవాలని ఆమోదించారు. అలాగే, రూ.163 కోట్లతో జ్యూడిషియల్ అకాడమీ స్థాపనకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. 2024-25 వార్షిక నివేదికలు కూడా ఈ సమావేశంలో ఆమోదించబడ్డాయి.
అమరావతి అభివృద్ధిలో భాగంగా నాబార్డ్ నుంచి రూ.7,380.70 కోట్ల భారీ రుణం పొందేందుకు సీఆర్డీఏ అంగీకారం తెలిపింది. సీడ్ యాక్సిస్ రహదారిని జాతీయ రహదారి-16తో అనుసంధించడానికి రూ.532 కోట్ల టెండర్లు ఆమోదించారు. జనవరికి ముందే మంగళగిరి రోడ్డుతో అనుసంధానం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయని కూడా తెలిపారు.
సీడ్ యాక్సిస్ రహదారిని సాఫీగా కలుపడానికి మధ్యలో స్టీల్ వంతెనలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండో విడత భూ సమీకరణలో తొలి విడత రైతులకు ఇచ్చిన ప్యాకేజీనే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణానికి సంబంధించిన భూములపై క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించినట్లు అధికారులు తెలిపారు.
అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పెద్ద ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా స్మార్ట్ ఇండస్ట్రీలు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ వంటి కీలక ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. రెండో విడతలో సమీకరించే 7,000 ఎకరాల్లో 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మించనున్నట్లు తెలిపారు. గత భూ సమీకరణ విధానాన్నే రైతుల కోసం కొనసాగిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.