ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు వైఖరి ఎలా ఉందంటే బంగారు గుడ్డు పెట్టే బాతును నరకడం అన్నట్లే ఉంది. తక్షణ లాభం కోసం దీర్ఘకాలికంగా లాభదాయకమైన వనరును నాశనం చేసుకోవడం అన్నమాట అమెరికా H-1B వీసా వ్యవస్థలో చోటుచేసుకుంటున్న తాజా మార్పులు భారతీయుల కోసం మరింత కఠినంగా మారుతున్నాయి. ప్రత్యేకంగా వీసా ఫీజులను భారీగా పెంచిన తర్వాత అమెరికా వెళ్లి ఉద్యోగాలు పొందాలని కలలుకంటున్న వేలాది మంది యువకులకు నిర్ణయంపై నీటిలో పోసిన పన్నీరు అయ్యింది.
నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (NFAP) వెల్లడించిన తాజా నివేదికలో ఫీజు పెంపు కారణంగా కేవలం రెండు నెలల్లోనే వీసా దరఖాస్తుల సంఖ్య సగానికి పైగా పడిపోయిందని వెల్లడించడంతో IT రంగం గందరగోళంలో పడిందని చెప్పుకోవాలి. ఈ మార్పులు విద్యార్థులకు, ఉద్యోగార్థులకు మాత్రమే కాదు, అమెరికా పర్యటనలు చేయాలనుకునే వారికి కూడా ఖరీదైన ప్రయాణంగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
NFAP విశ్లేషణ ప్రకారం భారతీయ ఐటీ కంపెనీలకు ఈ ఆర్థిక సంవత్సరంలో లభించిన H-1B వీసాల ఆమోదాలు పదేళ్ల కనిష్టానికి పడిపోయాయి. 2015తో పోలిస్తే మొత్తం ఆమోదాలు 70 శాతం తగ్గడం, 2024తో పోలిస్తే 37 శాతం పడిపోవడం ఈ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న మార్పుల తీవ్రతను బహిర్గతం చేస్తోంది. ఏడు ప్రధాన భారతీయ ఐటీ కంపెనీలు కలిపి ప్రారంభ నియామకాల కోసం కేవలం 4,573 వీసాలు మాత్రమే పొందడం ఆందోళన కలిగిస్తోంది. హెచ్-1బీ వీసాలకు లక్ష డాలర్ల వరకు పెంచిన ఫీజు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న AI ఆధారిత ఉద్యోగాల మార్పు ఈ సంక్షోభానికి ప్రధాన కారణాలుగా చెప్పబడుతోంది.
భారతీయ కంపెనీలలో టీసీఎస్ మాత్రమే అతిపెద్ద సంఖ్యలో H-1B అప్రూవల్స్ పొందిన సంస్థగా నిలిచింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్యోగాల కోసం టీసీఎస్‌కు 5,293 వీసా ఆమోదాలు వచ్చినప్పటికీ, వీటికి సంబంధించిన రిజెక్షన్ రేటు గతేడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగింది. 2024లో 4 శాతం మాత్రమే ఉన్న రిజెక్షన్ రేటు ఇప్పుడు 7 శాతానికి పెరగడం, అమెరికా వీసా విధానం కఠినతరమవుతున్నట్టు సూచిస్తోంది. ప్రారంభ నియామకాల కోసం టీసీఎస్‌కు ఈ ఏడాది కేవలం 846 వీసా ఆమోదాలు రావడం కూడా ఐటీ రంగం ఎదుర్కొంటున్న ఒత్తిడిని చూపిస్తోంది.
అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలలో అమెజాన్ ఈ ఏడాది H-1B పిటిషన్ ఆమోదాల్లో అగ్రస్థానంలో నిలిచింది. అమెజాన్‌కు మొత్తం 4,644 వీసాల ఆమోదాలు లభించగా, మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి అమెరికన్ సంస్థలు కూడా తొలి నాలుగు స్థానాలను ఆక్రమించాయి. ఇది గతంలో కనిపించని ధోరణి. భారతీయ కంపెనీలు టాప్ లిస్ట్ నుండి క్రమంగా దిగజారడం, అమెరికా సంస్థలు H-1B వ్యవస్థలో తమ ఆధిపత్యాన్ని పెంచుకున్నాయన్నది ఈ గణాంకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో భారతీయ ఐటీ కంపెనీలు తమ నియామక విధానాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవైపు H-1B వీసా ఖర్చులు భారీగా పెరగడం, మరో వైపు AI ఆధారిత ఆటోమేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలను మారుస్తోంది. యువత అమెరికాపై ఆధారపడకుండా భారతదేశం, యూరప్, మధ్యప్రాచ్యం వంటి ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా విధాన మార్పులు కొనసాగుతున్న నేపథ్యంలో H-1B కోసం ప్రయత్నించేవారు ప్రతి ఆర్థిక సంవత్సరంలో పెరుగుతున్న పోటీని ఎదుర్కోక తప్పదనేది ఇప్పుడు స్పష్టమవుతోంది.