ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిర్మాణ పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యోగార్థులకు ఉపయోగపడే ఈ లైబ్రరీ నిర్మాణం త్వరగా ప్రారంభం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ఇప్పటికే ప్రకటించిన ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
లైబ్రరీ డిజైన్ తయారీ, భవనం నిర్మాణ రూపకల్పన, ఆర్కిటెక్ట్ కన్సల్టెంట్ ఎంపిక వంటి ముఖ్యమైన అంశాలను పరిశీలించేందుకు ప్రభుత్వం ఏడు మంది నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. పాఠశాల విద్యాశాఖ నుంచి జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ కమిటీ పనులు, బాధ్యతలను స్పష్టంగా పేర్కొన్నారు.
ఈ కమిటీకి పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ కార్యదర్శిని ఛైర్మన్‌గా నియమించారు. అలాగే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, ఏపీ ఈడబ్ల్యూఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్, సమగ్ర శిక్షా చీఫ్ ఇంజినీర్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నిపుణులు మరియు ఇతర సాంకేతిక నిపుణులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ లైబ్రరీ నిర్మాణానికి సంబంధించిన అన్ని సాంకేతిక అంశాలను పరిశీలించి నివేదికను అందిస్తుంది.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ, సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌లు వెంటనే తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రాజెక్టు పనులు ఆలస్యం కాకుండా సంబంధిత శాఖలు సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని స్పష్టం చేశారు.
ఈ లైబ్రరీ నిర్మాణానికి సంబంధించిన తాజా ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ విడుదల చేశారు. ఆధునిక సౌకర్యాలతో అమరావతిలో నిర్మించబడుతున్న స్టేట్ సెంట్రల్ లైబ్రరీ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, పరిశోధకులకు పెద్ద ప్రయోజనం చేకూర్చనుంది. ఇది రాజధాని అభివృద్ధిలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అధికారులు తెలిపారు.