తెలుగుదేశం పార్టీ బలోపేతం దిశగా చేపట్టిన ఎంపీపీల శిక్షణ తరగతులు సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉత్సాహభరిత వాతావరణంలో మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 110 మంది మండలాధ్యక్షులకు ఏర్పాటు చేసిన ఈ శిక్షణ శిబిరాన్ని ఉదయం యోగా సెక్షన్ తో ప్రారంభించారు. తరువాత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధికారికంగా శిక్షణ తరగతులను ప్రారంభించి, పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకూ సాగిన ప్రయాణాన్ని, కార్యకర్తల పాత్రను, భవిష్యత్తు కార్యాచరణను వివరించారు. ఈ తరగతులను నాలుగు విభాగాలుగా ఏర్పాటు చేసి, పార్టీ సిద్ధాంతం, నిర్మాణం, ప్రజా చేరిక కార్యక్రమాలు, ఎన్నికల వ్యూహాలు వంటి అంశాలను నిపుణులు వివరణాత్మకంగా చెప్పడం ప్రత్యేకతగా నిలిచింది.
శిక్షణ తరగతుల్లో పాల్గొన్న మంత్రులు, ముఖ్య నాయకులు కార్యకర్తల ప్రాధాన్యతను మరోసారి స్పష్టంగా తెలియజేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ అప్పగించిన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తిస్తే గుర్తింపు సహజంగానే వస్తుందని అన్నారు. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు ఇస్తున్న గౌరవం దేశంలోని ఇతర పార్టీల్లో కనిపించదని ఆమె వివరించారు. సభ్యుల ఐక్యత క్రమశిక్షణ, ప్రజలతో అనుసంధానం వంటి అంశాలు మండలాధ్యక్షులు ప్రాథమికంగా పాటించాల్సిన బాధ్యతలని ఆమె చెప్పింది.
వ్యవసాయశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ టీడీపీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ ప్రజా సమస్యలకోసం నిరంతరం పోరాటం చేస్తూ వచ్చిన పార్టీ అని గుర్తు చేశారు. ఎదుగుదల కోసం అవకాశాలను సాధారణ కార్యకర్తలకే ముందుగా ఇచ్చే పార్టీ చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశమే అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీని నిలబెట్టేది సిద్ధాంతాలపై నమ్మకమున్న కార్యకర్తలే అని ఆయన అన్నారు.
స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ రాజకీయ చరిత్రలో టీడీపీ పోషించిన కీలక పాత్రను వివరించారు. ఒక ప్రాంతీయ పార్టీగా ప్రారంభమైన టీడీపీ జాతీయ రాజకీయాల్లోనూ ప్రధాన పాత్ర పోషించిందని, ముఖ్యంగా ప్రధానమంత్రుల ఎంపికలో కూడా టీడీపీకి ఉన్న ప్రాధాన్యతను గుర్తు చేశారు. అలాంటి పార్టీకి మండల స్థాయిలో పనిచేయడం గర్వకారణమని మండలాధ్యక్షులను ఉద్దేశించి చెప్పారు.
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, కార్యకర్తల సంక్షేమం కోసం మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న నిర్ణయాలు, సభ్యత్వ విస్తరణకు ఆయన చేస్తున్న కృషిని వివరించారు. గతంలో 65 లక్షల సభ్యత్వంతో ఉన్న పార్టీ నేడు కోటి దాటడం లోకేష్ పట్టుదలకు నిదర్శనమని అన్నారు. పార్టీ నిర్మాణాన్ని గ్రామస్థాయి వరకూ బలోపేతం చేయడంలో మండలాధ్యక్షులు కీలక పాత్ర పోషించాలన్నారు.
ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ మాజీ సీఎంలు కేసీఆర్, జగన్ లు ప్రజల నుండి దూరంగా ఫామ్ హౌసుల్లోకి వెళ్లిపోయారని కానీ చంద్రబాబు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాదరణను నిలబెట్టుకునేందుకు నిరంతరం పర్యటించే నాయకుడని అన్నారు. సాధారణ కార్యకర్తలను పెద్ద నాయకులుగా ఎదిగే అవకాశం ఇవ్వడం చంద్రబాబుకే సాధ్యమని గుర్తుచేశారు.
రోజంతా జరిగిన శిక్షణ తరగతుల్లో సూపర్ సిక్స్ పథకాలు, మండల స్థాయిలో కమిటీలు, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, కార్యకర్తల ఐక్యతను ఎలా పెంపొందించాలి వంటి అంశాలను నిపుణులు వివరించారు. గ్రామాలు, మండలాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకోవడం, పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం మండలాధ్యక్షుల ప్రధాన బాధ్యతగా పేర్కొన్నారు.