పిల్లల్ని ఎప్పుడు కనాలనే దానిపై చాలా మంది సందేహాల్లో ఉంటారు. కెరీర్, సెటిల్‌మెంట్, ఫైనాన్షియల్ స్థితి, జీవనశైలి మార్పులు ఈ అంశాల కారణంగా వివాహం ఆలస్యమవుతోంది, దాని ప్రభావంగా ప్రసవ వయసు కూడా ముందుకు జరగుతోంది. అయితే వైద్యులు మాత్రం ఆరోగ్య పరంగా పిల్లలను కనడానికి సరైన వయసు గురించి స్పష్టమైన సూచనలు చేస్తున్నారు. స్త్రీలు 20 నుంచి 30 ఏళ్ల మధ్య గర్భం దాల్చితే అది అత్యుత్తమం అని నిపుణులు చెబుతున్నారు. ఈ వయసులో గర్భధారణ సహజంగా విజయవంతం అవుతుందని, మాతృ శిశువులకు ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది.
35 ఏళ్లు దాటిన తర్వాత స్త్రీల్లో ఎగ్స్ క్వాలిటీ తగ్గిపోవడం, డౌన్ సిండ్రోమ్, జెస్టేషనల్ డయాబెటిస్, బీపీ, థైరాయిడ్ సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, పిల్లను కనడానికి తరువాత వయస్సులో ప్రయత్నించే చాలా మంది మహిళలు IVF లేదా ఇతర చికిత్సలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో పురుషులకు కూడా ప్రసవ సామర్థ్యం వయస్సుతో తగ్గిపోతుందని వైద్య అధ్యయనాలు సూచిస్తున్నాయి. పురుషులకు 25 నుంచి 35 ఏళ్లు ఉత్తమ వయసుగా భావిస్తున్నారు.
ప్రత్యేకంగా 40 ఏళ్లకు పైబడిన పురుషుల సంతానం పుట్టిన శిశువుల్లో ఆటిజం, జన్యు సమస్యలు, అభివృద్ధి లోపాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. తల్లిదండ్రులిద్దరూ 35 ఏళ్ల లోపే పిల్లలను కనడం ద్వారా శిశువు పూర్తి ఆరోగ్యంతో పుట్టే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. వైద్యపరంగా మాత్రమే కాకుండా భావోద్వేగపరంగా కూడా యువ వయసులో తల్లిదండ్రులు ఉండటం పిల్లల పెంపకానికి ఉపయోగపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.
అయితే ప్రతి వ్యక్తి పరిస్థితులు, జీవనశైలి, ఆరోగ్య పరిస్థితి వేరు కావడంతో ప్రసవ ప్రణాళికను వైద్యుల సలహాతో నిర్ణయించుకోవడం అత్యవసరం. సరైన వయసులో ఆరోగ్యకరమైన గర్భధారణ కోసం సమతుల్య ఆహారం, క్రమమైన వ్యాయామం, ఫోలిక్ ఆసిడ్ వంటి అవసరమైన పోషకాలు తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా, ఆరోగ్యం, సైంటిఫిక్ డేటా, భవిష్యత్తు దృష్ట్యా 20–30 వయసు స్త్రీలకు, 25–35 వయసు పురుషులకు ఉత్తమ గోల్డెన్ విండోగా వైద్యులు పేర్కొంటున్నారు.