మన రోజువారీ ఆహారంలో కూరగాయలు తప్పనిసరి అందులోనూ గ్రీన్ బీన్స్ మరియు బటానీలు మన వంటింట్లో తరచూ కనిపించే పదార్థాలు. ఈ రెండు కూరగాయలు పోషకాలు, రుచి, వంటకాలలో ఉంటాయి. అయితే ఆరోగ్య పరంగా చూసుకుంటే ఏది మెరుగైనదో తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మందికి ఉంటుంది. తాజా ఆరోగ్య అధ్యయనాలు నిపుణుల అభిప్రాయాలను ఆధారంగా తీసుకుని రెండు కూరగాయల మధ్య ఉన్న తేడాలు ప్రయోజనాలు ఇలా ఉన్నాయి.
మొదటగా బటానీల విషయానికి వస్తే ఇవి చిన్నవైనా పోషకాల్లో పెద్ద స్థానం సంపాదించాయి. ఒక కప్పు బటానీల్లో ప్రోటీన్ పరిమాణం గ్రీన్ బీన్స్ కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని పోషక నిపుణులు చెబుతున్నారు. అలాగే ఫైబర్ కూడా మూడు రెట్లు అధికంగా లభిస్తుంది. దీని వల్ల జీర్ణక్రియ మెరుగవడం, పొట్ట నిండిన భావం ఎక్కువ సేపు ఉండటం బరువు నియంత్రణ సులభం కావడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్ C, విటమిన్ K, ఫోలేట్, మ్యాగ్నీషియం వంటి అనేక పోషకాలు బటానీల్లో సమృద్ధిగా ఉండటం వల్ల హృదయ ఆరోగ్యానికి, కంటి ఆరోగ్యానికి, కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి సహాయపడుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఇక గ్రీన్ బీన్స్ విషయానికి వస్తే ఇవి తక్కువ కేలరీలతో పాటు తక్కువ కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. బరువును నియంత్రించాలనుకునే వారికి, తక్కువ కేలరీల డైట్ తీసుకునే వారికి ఇవి మంచి ఎంపికగా నిలుస్తాయి. గ్రీన్ బీన్స్‌లో విటమిన్ K అధికంగా ఉండటం వల్ల ఎముకల బలానికి ఇవి ప్రత్యేకంగా ఉపయుక్తం. అలాగే విటమిన్ A, ఫోలేట్, పొటాషియం వంటివి హృదయానికి, కళ్లకు ప్రయోజనం చేకూరుస్తాయి. ఇవి లో-ఫోడ్మాప్ డైట్‌కు అనుకూలంగా ఉండటం వల్ల IBS, క్రోన్‌స్ వంటి సమస్యలున్న వారికి కూడా వీటిని సూచిస్తారు.
బటానీల్లో ఉన్న పురిన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మూత్రపిండ సమస్యలు ఉన్నవారు, గౌట్ ఉన్నవారు వీటిని పరిమితంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రెండింటిలోనూ విటమిన్ K ఎక్కువగా ఉండటం వల్ల రక్తం పలుచబాటు మందులు తీసుకునేవారికి ప్రత్యేక జాగ్రత్త అవసరం.
మొత్తం మీద ఏది ఎంపిక చేసుకోవాలనేది మీ ఆహార అవసరాలు, ఆరోగ్య లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ కావాలనుకుంటే బటానీలు మంచి ఎంపిక. తక్కువ కేలరీలు, తేలికైన కూరగాయ కావాలనుకుంటే గ్రీన్ బీన్స్ ఉత్తమం. అయితే ఉత్తమ ఆరోగ్యం కోసం రెండింటినీ ఆహారంలో సమంగా చేర్చడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమాచారం కేవలం మీ అవగాహనకు మాత్రమే ముందుగా మీ డాక్టర్ ని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవలెను.