రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్ శనివారం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్)లో చేసిన ఆకస్మిక తనిఖీ సంచలనం సృష్టించింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఒక సాధారణ రోగిలా ఆసుపత్రికి రావడం వల్ల వైద్య సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు.
మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన జీజీహెచ్ ఓపీ విభాగానికి చేరుకుని, జ్వరం ఉందని చెప్పి ఓపీ చీటీ తీసుకున్నారు. తర్వాత సాధారణ రోగిలా వైద్యుడిని సంప్రదించి తన ఆరోగ్య సమస్యలను వివరించారు. ఫార్మసీ వద్ద కూడా ఇతర రోగులతో పాటు క్యూలో నిల్చుని మందులు తీసుకోవడం ఆసుపత్రి సిబ్బందిని మరింత ఆశ్చర్యపరిచింది.
ఈ సమయంలో దాదాపు గంట పాటు ఆయన ఆసుపత్రి లోని పలు విభాగాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందడంతో, జీజీహెచ్ సూపరింటెండెంట్ సహా సిబ్బంది హుటాహుటిన ఆయన ఉన్న చోటుకు చేరుకున్నారు. అప్పటికే ఆయన ఆర్థోపెడిక్ ఓపీ వద్ద ఉండటంతో, అక్కడున్నవారు ఆయన అసలు హోదా తెలుసుకుని ఆశ్చర్యపోయారు.
తర్వాత సౌరభ్ గౌర్ సూపరింటెండెంట్‌తో కలిసి ల్యాబ్, మెడికల్ ఓపీ వంటి విభాగాలను సవివరంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఒక పీజీ వైద్య విద్యార్థి రోగులతో కఠినంగా మాట్లాడటాన్ని గమనించి, అతడిని పిలిచి మాట్లాడారు. రోగులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించినట్లు తెలుస్తోంది.
మందుల చీటీలపై సరైన విధానం పాటించకపోవడం, వైద్యుల పనితీరు తగిన స్థాయిలో లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి వైద్యుడి పనితీరుకు సంబంధించిన ‘కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్’ (KPI) వివరాలు సేకరించి, సేవలను మెరుగుపరచడంపై ఆదేశాలు జారీ చేశారు.