Singapore: సింగపూర్‌ను ఏపీ అభివృద్ధిలో భాగస్వామిగా ఆహ్వానించిన సీఎం చంద్రబాబు!
Singapore: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామిగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. సింగపూర్ పర్యటనలో భాగంగా భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సీఎం సమావేశమయ్యారు.
సింగపూర్‌లో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. పెట్టుబడులపై చర్చలు..
ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించండి: చంద్రబాబు..
సింగపూర్: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామిగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. సింగపూర్ పర్యటనలో భాగంగా భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సీఎం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా భారత్–సింగపూర్ మధ్య ఉన్న ఆర్థిక, వాణిజ్య సంబంధాలపై శిల్పక్ అంబులే ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేలా సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించాలని సీఎం కోరారు.
రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ వంటి రంగాల్లో పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని చంద్రబాబు వివరించారు. షిప్ బిల్డింగ్, సివిల్ ఏవియేషన్ రంగాల్లో ఎంఆర్‌ఓ కేంద్రాల ఏర్పాటుకు కూడా ఏపీలో మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ప్రకృతి వ్యవసాయంలో రాష్ట్రం ముందుకు సాగుతోందని సీఎం పేర్కొన్నారు. ఇప్పటికే 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేసేందుకు రైతులు ముందుకొచ్చారని, ఏపీ రైతులు ప్రపంచ స్థాయి నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తున్నారని చెప్పారు. ఉద్యాన పంటలను ఎగుమతుల స్థాయికి తీసుకెళ్లడంతో పాటు ఆహార ఉత్పత్తుల్లో ట్రేసబులిటీ విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
రోబోటిక్స్, మెడికల్ డివైసెస్, హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో సింగపూర్ సహకారం కావాలని సీఎం కోరారు. సింగపూర్ టెక్నాలజీ రంగ అవసరాలను తీర్చే సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ యువతకు ఉందని అన్నారు.
పెట్టుబడులతోనే అభివృద్ధి, సంపద సృష్టి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడిందని, ప్రపంచ స్థాయి సంస్థలు భారత్‌తో పాటు ఏపీ వైపు వస్తున్నాయని తెలిపారు.
గతంలో భారత్ వృద్ధిపై తక్కువ అంచనాలు ఉండేవని, ప్రస్తుతం విధానాలు, సాంకేతిక నిపుణులు, అవసరమైన మౌలిక వసతులతో దేశం పెట్టుబడులకు సిద్ధంగా ఉందని సీఎం అన్నారు. సింగపూర్ విశ్వవిద్యాలయాలు, ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యాన్ని పెంచాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా డాక్టర్ శిల్పక్ అంబులే మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్ ఎకో సిస్టమ్ రంగాల్లో సింగపూర్ ముందంజలో ఉందని తెలిపారు. భారత్‌లోని వివిధ రాష్ట్రాలతో కలిసి పనిచేయడానికి సింగపూర్ ఆసక్తిగా ఉందని, ఏపీలో పెట్టుబడులకు అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధికి ఈ సమావేశం కీలకంగా మారుతుందని అధికారులు తెలిపారు.
Be the first to react