Nimmala Ramanaidu: వెలిగొండ పనులకు జోరు.. జూలై నాటికి టన్నెల్-2 లైనింగ్ పూర్తి!
Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఈ నెలలోనే పునరావాసం, పునరుద్ధరణ (ఆర్అండ్ఆర్) పరిహారం అందించనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
వెలిగొండ నిర్వాసితులకు గుడ్ న్యూస్.. రూ.905 కోట్లతో పునరావాస చర్యలు..
20 నెలల్లో వెలిగొండలో కీలక పురోగతి.. టన్నెల్ పనులు వేగవంతం..
డోర్నాల: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఈ నెలలోనే పునరావాసం, పునరుద్ధరణ (ఆర్అండ్ఆర్) పరిహారం అందించనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పరిహారం పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.
మంగళవారం డోర్నాల ప్రాంతంలో వెలిగొండ ప్రాజెక్టు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో కలిసి పరిశీలించారు. జంట సొరంగాల్లో జరుగుతున్న లైనింగ్ పనులు, టన్నెల్ బోరింగ్ మెషిన్ (టిబిఎం) తొలగింపు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
నల్లమలసాగర్ రిజర్వాయర్లో నీటిని నింపడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. నిర్వాసితుల పునరావాసం కోసం అదనపు బడ్జెట్లో రూ.905 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
వెలిగొండ ప్రాజెక్టులో కీలకమైన హెడ్ రెగ్యులేటర్ల రిటైనింగ్ వాల్, వింగ్స్, రిటర్న్స్ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. కొల్లంవాగు నుంచి 1 టీఎంసీ నీటిని టన్నెల్స్లోకి తీసుకురావడానికి అవసరమైన పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. టన్నెల్ ప్రాంతంలో పేరుకుపోయిన మట్టిని తొలగించే పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు.
టన్నెల్-1లో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న మట్టిని తొలగించే పనుల్లో ఇప్పటికే గణనీయమైన పురోగతి సాధించామని మంత్రి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల కాలంలో టన్నెల్-2లో 7 కిలోమీటర్ల లైనింగ్ పనులకు గాను 5.5 కిలోమీటర్లు పూర్తి చేశామని, మిగిలిన 1.5 కిలోమీటర్ల పనులను జూలై చివరి నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో టన్నెల్-2లో చిక్కుకుపోయిన టన్నెల్ బోరింగ్ మెషిన్ను బయటకు తీసేందుకు చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 7 కంపార్ట్మెంట్లలో 3 కంపార్ట్మెంట్లను తొలగించామని, క్లిష్టమైన హెడ్ భాగాన్ని టన్నెల్లోనే భద్రపరిచే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.
ఫీడర్ కెనాల్ పనుల్లో కూడా వేగం పెంచినట్లు మంత్రి తెలిపారు. 5.3 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని ఐదు నెలల్లో పూర్తి చేశామని చెప్పారు. నత్తనడకన సాగుతున్న 21 కిలోమీటర్ల లైనింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు, ఏజెన్సీ ప్రతినిధులకు ఆదేశాలు ఇచ్చారు.
ఇటీవల తుఫాను కారణంగా ఫీడర్ కెనాల్కు ఏర్పడిన భారీ గండికి సీసీ వాల్ నిర్మాణం చేపట్టి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. తీగలేరు, ఈస్టర్న్ మెయిన్ కెనాల్స్తో పాటు పర్మనెంట్ డైవర్షన్ రోడ్డు పనులు కూడా జూన్ నెలాఖరు నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సీజన్ ప్రారంభమయ్యే సమయానికి నల్లమలసాగర్ రిజర్వాయర్ను నింపే విధంగా వెలిగొండ పనులు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు.
గత ఐదేళ్లలో నిర్వాసితులకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అదనపు బడ్జెట్లో నిధులు కేటాయించి నిర్వాసితులకు అండగా నిలుస్తోందని తెలిపారు.
ఈ పర్యటనలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, యర్రగొండపాలెం టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు, జలవనరుల శాఖ అధికారులు, వెలిగొండ ప్రాజెక్టు అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Be the first to react