⚡ BREAKING

Kondapalli Srinivas: డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఏపీ అభివృద్ధిలో పరుగులు.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్!

Kondapalli Srinivas: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు వెళ్తోందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.

Kondapalli Srinivas
Kondapalli Srinivas

రెండేళ్ల కూటమి పాలన విజయోత్సవం.. అభివృద్ధి పనులకు శ్రీకారం..

దశాబ్దాలుగా ఎదురుచూసిన గ్రామాలకు రోడ్లు.. కొత్తపాలెం, జె.గుమడం రోడ్లు ప్రారంభం..

విజయనగరం: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు వెళ్తోందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.

బొండపల్లి మండలం జె. గుమడం గ్రామంలో నిర్వహించిన రెండేళ్ల ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తపాలెం–జీడిపాలెం రహదారిని రూ.2.34 కోట్లతో, జె.గుమడం రహదారిని రూ.50 లక్షలతో నిర్మించిన పనులను ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.

ఎన్నో ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు రహదారులు అందడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. మంత్రికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు పట్టగా, తీన్మార్ వాయిద్యాలతో సందడి చేశారు. మంత్రి స్వయంగా సైకిల్పై సభా ప్రాంగణానికి చేరుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సభలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాల ఫొటో ప్రదర్శన, ప్రకృతి వ్యవసాయం, నవధాన్యాల సాగు, అంగన్వాడీ చిన్నారులకు అందించే పోషకాహార ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ప్రముఖ కళాకారుడు జానకి రాము జానపద గేయాల ప్రదర్శన అలరించింది. కార్యక్రమంలో లబ్ధిదారులను మంత్రి సత్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఏపీ అభివృద్ధి వేగంగా సాగుతోందన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి భారీగా నష్టం జరిగిందని, అప్పుల భారం పెరిగిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రజల మధ్య ఉంటూ సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షిస్తోందన్నారు.

యువగళం కార్యక్రమంలో ప్రజలు తెలియజేసిన సమస్యలను పరిష్కరించేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం, అనకాపల్లిలో కొత్త స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, భోగాపురం విమానాశ్రయం, విశాఖలో గూగుల్ వంటి సంస్థల పెట్టుబడులు తీసుకురావడం వంటి చర్యలు చేపట్టామని వివరించారు.

విజయనగరం జిల్లాలో రిలయన్స్ డేటా సెంటర్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, జీడి పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్నారు. గజపతినగరంలో సుమారు 10 వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, గత పాలనపై విమర్శలు చేసిన మంత్రి.. ప్రజల భవిష్యత్తు కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున మాట్లాడుతూ గతంలో ప్రజలు తమ ఇళ్లు, ఆస్తులపై భయంతో ఉండేవారని, ప్రస్తుతం భావితరాల భవిష్యత్తు కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. బీజేపీ నాయకులు కూడా కేంద్ర సహకారంతో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.

జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు కూటమి పాలనలో వచ్చిన మార్పులను వివరించారు. విద్య, రహదారులు, పరిశ్రమలు, ఉపాధి రంగాల్లో చేపడుతున్న చర్యలను ప్రస్తావించారు. కార్యక్రమానికి ముందు మంత్రి రైతులు, మత్స్యకారులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Be the first to react

Latest