Tribal Welfare: మహిళలు, చిన్నారులు, గిరిజన సంక్షేమంలో రెండేళ్లలో అపూర్వ ప్రగతి!
Tribal Welfare: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహకారంతో మహిళలు, పిల్లలు, గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిందని రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.
సంక్షేమం నుంచి సాధికారత దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు: మంత్రి సంధ్యారాణి..
56,746 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 20 లక్షల మందికి సేవలు..
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహకారంతో మహిళలు, పిల్లలు, గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిందని రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.
సంక్షేమం అంటే కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, మహిళలకు భద్రత, పిల్లలకు పోషకాహారం, గిరిజన కుటుంబాలకు అభివృద్ధి అవకాశాలు, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. సంక్షేమాన్ని సాధికారతగా మార్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 56,746 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం, ఆరోగ్య సేవలు, పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దాదాపు 20 లక్షల మంది ఈ సేవలను పొందుతున్నారని చెప్పారు.
గత రెండేళ్లలో అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టామని, 5,389 మంది అంగన్వాడీ టీచర్లు, 5,287 మంది ఆయాలను నియమించి 11 వేలకు పైగా ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. మినీ అంగన్వాడీలను ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కోసం సుమారు రూ.100 కోట్లతో తాగునీరు, ఆర్వో ప్లాంట్లు, మరమ్మతులు, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. అన్ని కేంద్రాలకు దశలవారీగా ఇండక్షన్ స్టవ్లు అందిస్తున్నట్లు తెలిపారు.
గ్రామ స్థాయి వరకు డిజిటల్ సేవలను విస్తరించేందుకు రూ.72 కోట్లతో అంగన్వాడీ సిబ్బందికి 5జీ స్మార్ట్ఫోన్లు అందించినట్లు మంత్రి తెలిపారు. వీటి ద్వారా పిల్లల ఆరోగ్యం, పోషకాహారం, గర్భిణీలు, బాలింతల వివరాలను రియల్ టైమ్లో పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.
మహిళల రక్షణకు రాష్ట్రంలోని 26 జిల్లాల్లో వన్ స్టాప్ సెంటర్లు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. అత్యవసర సహాయం, న్యాయ సలహాలు, వైద్య సేవలు, మానసిక సహాయం ఒకే చోట అందిస్తున్నామని చెప్పారు.
బాల్య వివాహాల నివారణలో భాగంగా గత రెండేళ్లలో 3,393 బాల్య వివాహాలను అడ్డుకున్నామని తెలిపారు. బాలికల విద్య, భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని స్పష్టం చేశారు.
గర్భిణీలు, బాలింతల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని మంత్రి తెలిపారు. మొదటి ప్రసవానికి రూ.5 వేలు, రెండో ప్రసవానికి రూ.6 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. తల్లిపాల ప్రోత్సాహం, పోషకాహార భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి సంధ్యారాణి తెలిపారు. రాష్ట్రంలో 371 ఆశ్రమ పాఠశాలలు, 199 గురుకులాలు, 179 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు, 1,950 ప్రభుత్వ పాఠశాలల ద్వారా వేలాది మంది గిరిజన విద్యార్థులకు విద్య అందిస్తున్నామని చెప్పారు.
విద్యార్థులకు నోట్బుక్స్, స్టేషనరీ, స్టీల్ ప్లేట్లు, బెడ్షీట్లు, దుప్పట్లు వంటి అవసరమైన వస్తువులు అందిస్తున్నట్లు తెలిపారు. హాస్టళ్లలో పరిశుభ్రత, పోషకాహారం, భద్రతపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు.
గిరిజన ప్రాంతాల్లో కనిపించే సికిల్ సెల్ అనీమియా నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని మంత్రి తెలిపారు. విస్తృతంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ, విశాఖపట్నంలో ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.
గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపరిచి డోలీ మోతల పరిస్థితులకు ముగింపు పలకడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. రోడ్ల నిర్మాణం వేగంగా చేపడుతున్నామని చెప్పారు.
గిరిజన రైతుల ఆదాయం పెంచేందుకు కాఫీ, మిరియాలు, పసుపు, చింతపండు వంటి పంటలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. సుమారు 2.26 లక్షల ఎకరాల్లో కాఫీ సాగు జరుగుతోందని, ట్రైకార్ రుణాలు, మార్కెటింగ్ సదుపాయాల ద్వారా రైతులకు అండగా నిలుస్తున్నామని చెప్పారు.
అలాగే గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగును అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, ఈగల్ బృందాల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతోందని మంత్రి వెల్లడించారు.
ఇటీవల జరిగిన ఉపాధ్యాయ నియామకాలు పూర్తిగా రాజ్యాంగబద్ధ రిజర్వేషన్ విధానాలకు అనుగుణంగా, పారదర్శకంగా జరిగాయని మంత్రి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మహిళలు, దివ్యాంగులు, క్రీడాకారులకు నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేశామని చెప్పారు. 16,500కు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ద్వారా వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించామని తెలిపారు.
వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు చేస్తూ, గతంలో తొలగించిన వారే ఇప్పుడు దానిపై మాట్లాడటం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. యువతకు స్థిరమైన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
మహిళలు, పిల్లలు, గిరిజనుల సంక్షేమం మరియు సాధికారత కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు చేరేలా చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
Tags
Be the first to react