Supreme Court: అయోధ్య రామ మందిర విరాళాల వ్యవహారంపై దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్!
Supreme Court: అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకల దుర్వినియోగంపై ఆరోపణలు రావడంతో సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో వినతిపత్రం దాఖలైంది.
రామ మందిర కానుకల దుర్వినియోగ ఆరోపణలు.. సీబీఐ విచారణకు విజ్ఞప్తి..
విరాళాల వ్యవహారంలో పారదర్శకత కావాలి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన న్యాయవాది..
న్యూఢిల్లీ: అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకల దుర్వినియోగంపై ఆరోపణలు రావడంతో సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో వినతిపత్రం దాఖలైంది. విరాళాల వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని పిటిషన్లో కోరారు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కు ఉద్దేశించి ఈ వినతిపత్రాన్ని అడ్వకేట్ ఆన్ రికార్డ్ అనూప్ ప్రకాశ్ అవస్థి దాఖలు చేశారు. ఆలయ విరాళాలపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వంటి ఉన్నత స్థాయి సంస్థతో విచారణ జరిపించాలని, ఆ దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు.
అయోధ్య రామ మందిరం కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశమని పిటిషన్లో పేర్కొన్నారు. ఆలయానికి దేశం నలుమూలలతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారని, వాటి నిర్వహణపై అనుమానాలు రావడం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోందని తెలిపారు.
ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసినప్పటికీ, ఇప్పటివరకు అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం, పూర్తి స్థాయి క్రిమినల్ దర్యాప్తు ప్రారంభం కాకపోవడం అనేక ప్రశ్నలకు దారితీస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు.
కేవలం SIT విచారణతో భక్తుల్లో ఉన్న అనుమానాలు పూర్తిగా తొలగవని, రాజ్యాంగ న్యాయస్థానం పర్యవేక్షణలో జరిగే విచారణ మాత్రమే నమ్మకాన్ని పెంచుతుందని వినతిపత్రంలో వివరించారు.
ఆలయానికి వచ్చిన విరాళాల సేకరణ, లెక్కలు, భద్రత, నిర్వహణ, ఖర్చుల విధానం వంటి అన్ని అంశాలను పరిశీలించాలని కోరారు. భక్తులు సమర్పించిన ధనాన్ని రక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కూడా పిటిషన్లో విజ్ఞప్తి చేశారు.
శ్రీరామ జన్మభూమి ఆలయానికి సంబంధించిన విరాళాల విషయంలో పూర్తి పారదర్శకత ఉండాలని, భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకు స్వతంత్ర దర్యాప్తు అవసరమని పిటిషనర్ పేర్కొన్నారు.
Be the first to react