Ram Mohan Naidu: నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన సేవలు.. ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు!
Ram Mohan Naidu: ఉత్తరప్రదేశ్‌లోని జేవర్ వద్ద నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. దేశ పౌర విమానయాన రంగంలో ఇది మరో ముఖ్యమైన ముందడుగుగా నిలిచిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే. రామ్మోహన్ నాయుడు తెలిపారు.
భారత విమానయాన రంగంలో కొత్త మైలురాయి.. జేవర్ ఎయిర్పోర్ట్ నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం..
తొలి ప్రయాణికులతో నింగిలోకి నోయిడా ఎయిర్పోర్ట్.. దేశ కనెక్టివిటీకి మరింత బలం..
నోయిడా: ఉత్తరప్రదేశ్లోని జేవర్ వద్ద నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. దేశ పౌర విమానయాన రంగంలో ఇది మరో ముఖ్యమైన ముందడుగుగా నిలిచిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే. రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ప్రారంభ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. తొలి దశలో ఈ విమానాశ్రయం ఏడాదికి 1.2 కోట్ల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యంతో పనిచేస్తుందని చెప్పారు. పూర్తిస్థాయిలో అభివృద్ధి పూర్తయిన తర్వాత ఏడాదికి 7 కోట్లకు పైగా ప్రయాణికులను సేవలందించే స్థాయికి చేరుకుంటుందని వివరించారు.
నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలకు ప్రధాన కేంద్రంగా మారనుందని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఆధునిక విమానాశ్రయాలు, మెరుగైన కనెక్టివిటీ కోసం చేపడుతున్న ప్రణాళికల్లో భాగంగానే ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఈ విమానాశ్రయ నిర్మాణం కొనసాగిందన్నారు.
విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన రైతులకు గౌరవ సూచకంగా తొలి వాణిజ్య విమాన ప్రయాణాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. జేవర్ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్ నేతృత్వంలో 170 మంది రైతులు తొలి విమానంలో నోయిడా నుంచి లక్నోకు ప్రయాణించారు.
దేశంలో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని రామ్మోహన్ నాయుడు చెప్పారు. 2014లో దేశంలో ఉన్న విమానాశ్రయాల సంఖ్య 74 కాగా, ప్రస్తుతం అది 165కు పెరిగిందన్నారు. గత దశాబ్దంలో విమానాశ్రయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1.40 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు వివరించారు.
నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా దేశీయ, అంతర్జాతీయ రవాణా మరింత సులభతరం అవుతుందని, ప్రాంతీయ అభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుందని మంత్రి తెలిపారు.
ఇదిలా ఉండగా అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తులో ఆలస్యం జరుగుతోందన్న ప్రశ్నలకు మంత్రి స్పందించారు. విమాన ప్రమాదాలపై దర్యాప్తు అత్యంత జాగ్రత్తగా, నిబంధనల ప్రకారమే జరుగుతుందని చెప్పారు. ప్రమాద స్వభావం, పరిస్థితులపై ఆధారపడి ఇలాంటి విచారణలకు సమయం పడుతుందని తెలిపారు.
నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో భారత విమానయాన మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం అవుతాయని, దేశ, ప్రపంచ స్థాయి కనెక్టివిటీకి ఇది కీలకంగా మారుతుందని అధికారులు తెలిపారు.
Be the first to react