Atchennaidu: రైతులకు ఊరట.. ఎఫ్‌సీవీ పొగాకు వేలాల్లో మెరుగైన పరిణామాలు!
Atchennaidu: ఆంధ్రప్రదేశ్‌లో ఎఫ్సీవీ (FCV) పొగాకు కొనుగోళ్ల ప్రక్రియ గత కొన్ని రోజులుగా మెరుగైన దిశగా సాగుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
30-37 శాతం నుంచి 20 శాతానికి తగ్గిన పొగాకు రిజెక్షన్లు..
పొగాకు కొనుగోళ్లపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష.. రైతుల ప్రయోజనాలే లక్ష్యం..
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎఫ్సీవీ (FCV) పొగాకు కొనుగోళ్ల ప్రక్రియ గత కొన్ని రోజులుగా మెరుగైన దిశగా సాగుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మార్కెట్లో కొనుగోలుదారుల భాగస్వామ్యం పెరగడం, లిక్విడిటీ మెరుగుపడటం, వేలం కేంద్రాల్లో తిరస్కరణలు తగ్గడం రైతులకు ఆశాజనక పరిణామమని ఆయన పేర్కొన్నారు.
పొగాకు కొనుగోళ్ల పరిస్థితిపై గురువారం మంత్రి అచ్చెన్నాయుడు సహచర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, ఆనం రామనారాయణరెడ్డి, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, అలాగే పొగాకు పండించే జిల్లాల ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత మార్కెట్ పరిస్థితులపై సమీక్షించారు.
మంత్రి మాట్లాడుతూ జూన్ 11 నాటికి టొబాకో బోర్డు ఆధ్వర్యంలోని వేలం కేంద్రాల ద్వారా మొత్తం 15.65 మిలియన్ కిలోగ్రాముల ఎఫ్సీవీ పొగాకు మార్కెట్కు చేరిందని తెలిపారు. రాష్ట్రంలోని 16 వేలం కేంద్రాలకు ప్రస్తుతం రోజుకు సుమారు 8 వేల బేళ్ల పొగాకు వస్తోందని, దీంతో కొనుగోళ్ల ప్రక్రియ వేగం పుంజుకుందని చెప్పారు.
ఇటీవల కాలంలో అత్యంత సానుకూల పరిణామంగా పొగాకు తిరస్కరణలు తగ్గడాన్ని మంత్రి ప్రస్తావించారు. గతంలో 30 నుంచి 37 శాతం వరకు ఉన్న రిజెక్షన్లు ప్రస్తుతం దాదాపు 20 శాతానికి తగ్గాయని తెలిపారు. దీనివల్ల మార్కెట్లో పొగాకుకు డిమాండ్ పెరుగుతోందని, రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు.
మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు టొబాకో బోర్డు వ్యాపారులు, ఎగుమతిదారులు, కొనుగోలుదారులు, రైతు ప్రతినిధులతో నిరంతరం చర్చలు జరుపుతోందని మంత్రి వెల్లడించారు. జూన్ 8న నిర్వహించిన సమావేశాల్లో కొనుగోలుదారులు అన్ని రకాల గ్రేడ్ల పొగాకును సమతుల్యంగా వేలానికి తీసుకొస్తే దేశీయ, ఎగుమతి మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారని తెలిపారు.
రైతులు కూడా తిరస్కరణలు తగ్గి కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగితే అన్ని గ్రేడ్ల పొగాకును మార్కెట్కు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారని మంత్రి వివరించారు. వేలం కేంద్రాలకు పొగాకు రాకలను నియంత్రిత స్థాయిలో కొనసాగించడం, కొనుగోలుదారుల భాగస్వామ్యాన్ని పెంచడం, సరఫరా–కొనుగోలు మధ్య సమతుల్యత తీసుకురావడం వంటి అంశాలపై అన్ని వర్గాల్లో ఏకాభిప్రాయం వచ్చిందన్నారు.
ఈ నేపథ్యంలో టొబాకో బోర్డు కొనుగోలు సంస్థలతో సమన్వయం చేస్తూ వారానికి కొనుగోలు లక్ష్యాలను నిర్ణయించి, రైతుల వద్ద ఉన్న పొగాకు నిల్వలను వేగంగా విక్రయించేలా చర్యలు చేపడుతోందని తెలిపారు.
దాదాపు పది రోజుల క్రితం ఉన్న పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం కొనుగోలు సంస్థలు తమ కార్యకలాపాలను పెంచాయని, దీంతో మార్కెట్లో సానుకూల వాతావరణం ఏర్పడిందని మంత్రి అన్నారు.
పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం, టొబాకో బోర్డు కట్టుబడి ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులు, వ్యాపారులు, కొనుగోలుదారుల సహకారంతో రాబోయే రోజుల్లో పొగాకు మార్కెటింగ్ మరింత వేగవంతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Tags
Be the first to react