ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,
సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..
సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 36వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.
ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.
ఓం వ్యాసదేవాయ నమః
పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో
శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి
36. ఓం పరమ శాంతి ప్రదాయై నమః
అర్థం: మానవులు ఆనందంగా జీవించటానికి సుఖశాంతులు అవసరం. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు సుఖం కలిగిస్తాయి. పట్టు పరుపుల మీద పవ్వళిస్తే సుఖమే. కానీ ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడు హాయిగా ఉంటుందా? అంటే సుఖాలు ఉన్నంత మాత్రాన శాంతి ఉన్నట్టు కాదు. కోరికలతో, భయాలతో, బాధలతో, సమస్యలతో, అలజడితో మనిషి మనసు ఎల్లప్పుడూ ఉత్తుంగ తరంగాలు చెలరేగే సముద్రం లాగా ఉంటుంది. ఎప్పుడు అలలు ఆగుతాయి? ఇక శాంతి ఎప్పుడు?
నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా ।
న చాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖమ్ ॥ ౨.౬౬
అర్థం: ఇంద్రియ నిగ్రహం, సహనం లేని వానికి వివేకబుద్ధి కలగదు. ఆత్మచింతన కూడా కలగదు. ఆత్మచింతన లేని వానికి శాంతి లభించదు. శాంతి లేని వానికి సుఖం ఎక్కడిది?
భగవంతుడు శాంతి స్వరూపుడు. ‘శాంతో-యం ఆత్మా’. శాంతియే ఆ తండ్రి సహజ స్థితి. ఆ తండ్రి బిడ్డగా ఆ సహజస్థితిని నేనెట్లా పొందగలను?
తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత ।
తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ ॥ ౧౮.౬౨
అర్థం: సర్వ విధముల ఆ పరమాత్మనే శరణు వేడు. ఆ తండ్రి అనుగ్రహంతో సర్వోత్తమమైన శాంతిని, శాశ్వతమైన మోక్షపదవిని పొందగలవు.
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః । జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్ఛతి ॥ ౪.౩౯
శ్రద్ధ గలవాడు, ఇంద్రియాలను జయించిన వాడు జ్ఞానియై పరమశాంతిని పొందుతున్నాడు.
భవఘ్ని సభ్యులుగా మనం శాంతిగా ఉంటూ అందరి శాంతిని కోరుకొంటూ, శాంతిగా ఉండటానికి సహాయం చేస్తూ, ఎవరి శాంతికీ భంగం కలిగించకూడదని ఒక లక్ష్యంతో ఇక్కడ నడుస్తున్నాం. శాంతి ప్రార్థన చేస్తున్నప్పుడు, ‘సర్వేషాం స్వస్తిర్భవతు’ (అందరికి శుభం కలుగు గాక) అనే అద్భుతమైన ప్రార్థన చేస్తున్నపుడు ఎంతో శాంతి లభిస్తుంది.
అశాంతితో నేను అలమటించేటప్పుడు యథార్థమైన శాంతి స్వరూపంగా నాలోని దుఃఖాన్ని పోగొట్టి, పరమశాంతిని ప్రసాదిస్తున్న గీతామాతకు ప్రశాంతహృదయంతో ప్రణమిల్లుతున్నాను.
ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు
లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ
జై గురుదేవ్
నామం 29 : Bhagavad Gita: భయంలేని జీవితం దైవసంపదతోనే సాధ్యం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -29!
నామం 28 : Bhagavad Gita: మోక్షానికి మూలం ధ్యానం, ధ్యానానికి మూలం దివ్యశక్తి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -28!
నామం 26 : Bhagavad Gita: జన్మ మరణాలను జయించేది సమస్థితి అదే మోక్షమార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -26!
నామం 24 : జీవాత్మ నుండి పరమాత్మ వరకు గీతా ప్రబోధం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -24!
నామం 16 : Bhagavad Gita: నశించేది జగత్తే.. నిలిచేది ఆత్మ స్వరూపమే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -16!
నామం 15 : Bhagavad Gita: భగవద్గీత పఠనమే జన్మదుఃఖ విముక్తి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -15!
నామం 14 : Bhagavad Gita: ధర్మాన్ని హరిస్తే అది మనల్ని హరిస్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-14!