ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,
సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..
సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 13వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.
ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.
ఓం వ్యాసదేవాయ నమః
పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో
శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి
13. ఓం వేద స్వరూపిణ్యై నమః
అర్థం: వేదం భగవత్ స్వరూపం అని మహర్షుల వాక్యం. వేదాలను అపౌరుషేయాలు అంటారు. అంటే అవి పురుషుల నుండి, అనగా మానవుల నుండి వెలువడినవి కావు. మహా మౌనస్థితిలో ఉన్న మహర్షులు అనంతం (పరమాత్మ)నుండి వెలువడిన మంత్రాలను దర్శించారు. అందుకనే ఆ ఋషులను ద్రష్టలు అంటారు. ద్రష్టలు అంటే దర్శించిన వారు. వేదాలు నాలుగు.
1. ఋగ్వేదము, 2. యజుర్వేదము, 3. సామ వేదము, 4.అథర్వ వేదము.
‘ఇష్టప్రాప్త్యనిష్ట పరిహారయోః యో అలౌకికముపాయం వేదయతి స వేదః’ (ఇష్టమైనది కలుగుటకు, అనిష్టం తొలగుటకు అలౌకికమైన ఉపాయం తెలిపేది వేదము.) జీవుడు తల్లి కడుపున పడినది మొదలు మరణానంతరం వరకు ఆ జీవుని సంస్కారం కొరకు కొన్ని కర్మలు వేదంచేత విధింపబడుతున్నాయి.ఋగ్వేదం దైవస్తుతి రూపాలైన, ఛందోబద్ధమైన మంత్రాలతో కూడినట్టిది. యజ్ఞయాగాది కార్యాలలో చదివే వచనాత్మక మంత్రాలు యజుర్వేదము. గానం చేయదగిన మంత్ర సముదాయం సామ వేదము. అనేక శాస్త్ర, వైజ్ఞానిక విషయాలతో కూడినది అథర్వ వేదము. ‘వేదో ధర్మమూలం’ - గౌతమ మహర్షి. ధర్మానికి మూలం వేదం.
వేదం ప్రకృతిలో పరమాత్మను దర్శించింది. యజ్ఞ క్రియల ద్వారా దైవశక్తిని ప్రసన్నం చేసుకొనే మంత్రాలు వేదాల్లో ఉంటాయి. యజ్ఞమంటే ఏమిటో, తపస్సు అంటే ఏమిటో భగవద్గీత తెలియజేసింది. వేదాల సారాంశం భగవద్గీతలో నిక్షిప్తం అయింది. ఋగ్వేద, సామవేద, యజుర్వేదములను నేనే, అవి నా స్వరూపమే అని పరమాత్మ రాజవిద్యా రాజగుహ్య యోగంలో చెపుతున్నారు.
సర్వ వేదమయీ గీతా -స్కాంద పురాణము.
వ్యాసమహర్షి రచించిన మహాభారత ఇతిహాసాన్ని ‘పంచమ వేదము’ అంటారు. అందలి భీష్మ పర్వంలో భగవానుని ఉపదేశమైన గీత ఇమిడి ఉంది.
వేదాల అంతిమభాగమే ఉపనిషత్తులు. అందుకే వాటిని వేదాంతం అంటారు. నర నారాయణుల సంవాదరూపమైన భగవద్గీత ఉపనిషత్తుల సారమే అని శ్రీ వ్యాస దేవులవారే తెలిపారు. అంటే భగవద్గీత వేదసారమైన ఉపనిషత్తుల సారమే.
వేదస్వరూపమైన నా తల్లి భగవద్గీతకు శ్రద్ధతో ప్రణామం చేస్తున్నాను.
ఈ జన్మను సార్థకం, సఫలం చేసుకోవటానికి ప్రతి క్షణం గీతామాతను గుర్తు చేసుకొంటూ, ఇంతటి అనుగ్రహాన్ని ప్రసాదించిన సాక్షాత్తు విష్ణు స్వరూపులైన వ్యాసదేవులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు
లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ
జై గురుదేవ్
నామం 10 :Bhagavad Gita : ఈ జన్మను సార్థకం, సఫలం చేసుకోవటానికి ప్రతి క్షణం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 10!
నామం 7 : Bhagavad Gita: ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-7!