ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,
సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..
సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 26వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.
ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.
ఓం వ్యాసదేవాయ నమః
పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో
శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి
26. ఓం మోక్ష ప్రదాయై నమః
అర్థం: సమస్త దుఃఖాలనుండి విముక్తి పొందటమే మోక్షం. జన్మ పరంపర నుండి విముక్తి కావటమే మోక్షం. ఆ ముక్తిబోధ శ్రీమద్భగవద్గీత.
ఓం త్య్రంబకం యజామహే
సుగంధిం పుష్టి వర్ధనమ్ ।
ఉర్వారుకమివ బంధనాత్
మృత్యోర్ముక్షీయ మామృతాత్ ॥
-మృత్యుంజయ మంత్రము, యజుర్వేదము
అర్థం: సుగంధయుక్తుడైన, సమృద్ధికరుడైన ఈశ్వరుని మేము సేవిస్తాము. అతడు పండిన దోసపండు తీగనుండి దోసపండు వేరుపడినట్లు మృత్యుబంధం నుండి మమ్ములను వేరు చేస్తాడు. అమృతత్త్వం నుండి మాత్రము వేరు చేయకుండును గాక!
దోసకాయ అప్పటి వరకు తీగతో ఉండి, పండినప్పుడు దానంతట అదే తీగనుండి విడిపోతుంది. పాదు దగ్గరే ఉంటుంది కాని పాదుకి, దానికి సంబంధం ఉండదు. మనసుని సమంగా ఉంచుకొన్నప్పుడు, నాతో సహా అంతా బహ్మమే అని సమంగా చూసినప్పుడు మనమూ అలాగే ఉంటాము.
సమదర్శినః, సమత్వం యోగముచ్యతే, సమే కృత్వా - ఇలా సమత్వం అనే మాట భగవద్గీతలో చాల సార్లు చెప్పారు. సమం = మారకపోవటం, భేదాలు లేకపోవటం, హెచ్చుతగ్గులు లేకపోవటం. సమత్వం అంటే ఏ భేదాలు లేకుండా, దోషాలు లేకుండా, మార్పు లేకుండా, ఉన్నది ఉన్నట్లుగా ఉండటం. మనస్సు సమంగా లేకపోతే అది బంధం, సమంగా ఉంటే అది మోక్షం. మనస్సు అలజడిగా ఉంటే అది బంధం నిశ్చలమయితే అది మోక్షం. మనస్సు అనేకదృష్టితో ఉంటే అది బంధం ఏకంగా, ఏకదృష్టితో ఉంటే అది మోక్షం. ఏకదృష్టితో ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అనేకదృష్టితో ఉంటే అలజడిగా ఉంటుంది.
ఇహైవ తైర్జితః సర్గో యేషాం
సామ్యే స్థితం మనః ।
నిర్దోషం హి సమం బ్రహ్మ
తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః ॥
పరమాత్మ (బ్రహ్మ) దోషం లేనిది, సమమైనది. ఎవరి మనస్సు సమభావంలో స్థిరంగా ఉంటుందో, అట్టివారు బ్రహ్మములో ఉన్నవారై ఈ జన్మలోనే సంసారాన్ని జయిస్తారు. నీటితో నీరే కలుస్తుంది. నూనె కలవదు. అట్లాగే దోషం లేనివారే, సమదృష్టి గలవారే నిర్దోషమైన, సమత్వం గల పరమాత్మను పొందగలరు. వారు ఎప్పుడూ సచ్చిదానంద స్థితిలోనే ఉంటారు. ‘సర్వం ఖల్విదం బ్రహ్మ’. ఆత్మ కన్న భిన్నమైనది ఏదీ లేనే లేదు. ఇలా స్థిరపరుచుకొన్నవారు మరణించాక కాదు, ఈ జన్మలోనే సర్గమును అంటే సంసారాన్ని, జనన మరణాలను జయిస్తారు. అదే మోక్షం.
అర్జున విషాద యోగంతో మొదలవుతుంది భగవద్గీత. ఆ విషాదమంతా తీరిపోగా, చివరికి మోక్షసన్న్యాస యోగంతో ముగుస్తుంది. మోక్షమే చివరి మెట్టు. విషాదం జీవ లక్షణం. ఆనందం మోక్షరూపమైన పరమాత్మ లక్షణం.
ఈ తీరున మానసిక సమస్థితి కలిగిస్తూ, జన్మ పరంపర నుండి నాకు విముక్తి ప్రసాదించే గీతామాతకు భక్తి ప్రపత్తులతో అంజలి ఘటిస్తున్నాను.
ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు
లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ
జై గురుదేవ్
నామం 24 : జీవాత్మ నుండి పరమాత్మ వరకు గీతా ప్రబోధం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -24!
నామం 16 : Bhagavad Gita: నశించేది జగత్తే.. నిలిచేది ఆత్మ స్వరూపమే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -16!
నామం 15 : Bhagavad Gita: భగవద్గీత పఠనమే జన్మదుఃఖ విముక్తి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -15!
నామం 14 : Bhagavad Gita: ధర్మాన్ని హరిస్తే అది మనల్ని హరిస్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-14!
నామం 10 :Bhagavad Gita : ఈ జన్మను సార్థకం, సఫలం చేసుకోవటానికి ప్రతి క్షణం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 10!
నామం 7 : Bhagavad Gita: ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-7!