తండ్రి ప్రేమ, త్యాగం, మార్గదర్శకత్వాన్ని గుర్తుచేసుకున్న ప్రవాస తెలుగు కుటుంబాలు..
అమెరికాలో తెలుగు సంప్రదాయాలతో ఫాదర్స్ డే వేడుకలు.. పాల్గొన్న ప్రముఖులు..
వర్జీనియా: అమెరికా రాజధాని ప్రాంతంలోని వర్జీనియాలో తానా-పాఠశాల ఆధ్వర్యంలో ఫాదర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. తండ్రి గొప్పతనం, కుటుంబంలో ఆయన పాత్ర, పిల్లల జీవితాల్లో ఆయన ఇచ్చే విలువలను గుర్తుచేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ వేడుకలకు టీటీడీ పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్, తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమానికి తానా-పాఠశాల చైర్మన్ భాను మాగులూరి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా మల్లెల రాజశేఖర్ మాట్లాడుతూ తండ్రి అంటే కేవలం ఒక వ్యక్తి కాదని, ఒక కుటుంబానికి బలమైన ఆధారం, మార్గదర్శి, రక్షకుడని అన్నారు. తండ్రి ప్రేమ, త్యాగం కుటుంబ సభ్యులకు ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ప్రవాస భారతీయుల కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెబుతూ, ఎన్నారైలు మరియు వారి కుటుంబ సభ్యులకు వంద టికెట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే అమెరికాలోని ఆరు నగరాల్లో శ్రీనివాస కళ్యాణం కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన మాట్లాడుతూ జీవితంలో ప్రతి అడుగులో ధైర్యం, క్రమశిక్షణ, బాధ్యత, విలువలను నేర్పించే మొదటి గురువు తండ్రేనని అన్నారు.
తండ్రిని గౌరవించడం, ఆయన చేసిన త్యాగాలను గుర్తుంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అలాగే ప్రవాస తెలుగు వారు తమ మాతృభాషను కాపాడుకోవడానికి కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ తల్లి ప్రేమను మాటల్లో వ్యక్తపరిస్తే, తండ్రి ప్రేమను తన కష్టాల ద్వారా చూపిస్తాడని అన్నారు. కుటుంబం సంతోషంగా ఉండాలని తన సుఖాలను పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి తండ్రి అని చెప్పారు.
మన విజయాల వెనుక తండ్రి కష్టం, త్యాగం, ఆశీర్వాదం ఉంటాయని తెలిపారు. పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కనే మొదటి వ్యక్తి తండ్రేనని అన్నారు.
తానా-పాఠశాల చైర్మన్ భాను మాగులూరి మాట్లాడుతూ కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. మాతృభూమి, మాతృభాషలను రెండు కళ్లుగా భావించే ప్రవాస భారతీయుల జీవితాల్లో తండ్రికి ప్రత్యేక స్థానం ఉందన్నారు.
"నాన్న ఉన్నాడనే ధైర్యం, ఉంటాడనే నమ్మకం మనలను ముందుకు నడిపిస్తుంది" అని పేర్కొన్నారు. తండ్రి భుజం తట్టి చెప్పే మాటలు, ఆయన ఇచ్చే అనుభవాలు జీవితానికి విలువైన పాఠాలని, ఎప్పటికీ వదలని చేయి నాన్నదేనని అన్నారు.
కార్యక్రమం ప్రారంభంలో సరస్వతీ దేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఫాదర్స్ డే వేడుకలను జరుపుకున్నారు. తానా కార్యవర్గ సభ్యులు అనిల్ ఉప్పలపాటి, సాయి బొల్లినేని, సుధీర్ కొమ్మి అతిథులను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో GWTCS అధ్యక్షులు రవి అడుసుమిల్లి, ఉపాధ్యక్షులు సుశాంత్ మన్నే, పలువురు ప్రవాస తెలుగు ప్రముఖులు, పెద్దలు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. తండ్రి ప్రేమ, సేవ, త్యాగానికి అంకితమైన ఈ వేడుక ప్రవాస తెలుగు సమాజంలో కుటుంబ విలువలను మరోసారి గుర్తుచేసింది.
Tags
Be the first to react