Yogandhra: ఉపమాకలో పండగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమం.. యోగాసనాలు వేసిన హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్!
Yogandhra: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం పండగ వాతావరణంలో జరిగింది.
ఆరోగ్యమే మహాభాగ్యం.. యోగాతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన యోగాంధ్ర..
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సామూహిక యోగ సాధన..
నక్కపల్లి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం పండగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పాల్గొని యోగాసనాలు వేశారు.
ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు, అధికారులు, యోగా సాధకులు హాజరై సామూహికంగా యోగ సాధన చేశారు. ఆలయ ప్రాంగణం యోగాభ్యాసంతో ఆధ్యాత్మికత, ఆరోగ్య సందేశంతో సందడిగా మారింది.
ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో యోగ సాధన చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప ప్రాచీన వారసత్వ సంపద అని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా యోగాకు ప్రత్యేక గుర్తింపు రావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కృషి ఎంతో కీలకమని మంత్రి తెలిపారు. నేడు అనేక దేశాలు యోగాను తమ రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవడం భారతదేశానికి గర్వకారణమన్నారు.
ప్రస్తుత జీవన విధానంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు, విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో యోగా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను అందించే సాధనంగా ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కొంత సమయం యోగాకు కేటాయించి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.
అనంతరం జపాన్లో జరిగిన హాకీ ఆసియా కప్ పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకం సాధించిన క్రీడాకారిణి నమ్మి గీతా శ్రీనును హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్ ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా గీతా శ్రీను సాధించిన విజయాన్ని అభినందించిన వారు, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడాకారులు, యోగా అభిమానులు పాల్గొన్నారు.
Be the first to react