Telugu: షాంఘైలో తెలుగు సాహిత్య సంబరం.. 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు సన్నాహాలు
Telugu: తెలుగు భాష, సాహిత్య ప్రాచుర్యానికి వేదికగా నిలిచే ప్రతిష్టాత్మక 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు చైనా దేశంలోని షాంఘై మహానగరంలో నిర్వహించనున్నారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరియు షాంఘై తెలుగు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు 2026 అక్టోబర్ 24, 25 తేదీల్లో జరగనుంది.
ప్రపంచ తెలుగు భాషాభిమానులకు ఆహ్వానం.. అక్టోబర్లో షాంఘైలో సాహితీ మహాసభ..
వంగూరి ఫౌండేషన్, షాంఘై తెలుగు సంఘం ఆధ్వర్యంలో 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు..
షాంఘై: తెలుగు భాష, సాహిత్య ప్రాచుర్యానికి వేదికగా నిలిచే ప్రతిష్టాత్మక 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు చైనా దేశంలోని షాంఘై మహానగరంలో నిర్వహించనున్నారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరియు షాంఘై తెలుగు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు 2026 అక్టోబర్ 24, 25 తేదీల్లో జరగనుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులు, సాహితీవేత్తలు, కవులు, రచయితలు ఈ మహాసాహిత్య వేడుకలో పాల్గొని తెలుగు సాహిత్య వైభవాన్ని పంచుకోవాలని నిర్వాహకులు ఆహ్వానించారు.
ఈ సదస్సుకు భారత మాజీ ఉపరాష్ట్రపతి, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు, ప్రముఖ సినీ నటుడు, కవి శ్రీ తనికెళ్ల భరణి తదితర ప్రముఖులు ఆహ్వానిత అతిథులుగా హాజరుకానున్నారు.
చైనాలోని వివిధ నగరాల్లో నివసిస్తున్న తెలుగు సాహితీవేత్తలు, భాషాభిమానులు ఒకే వేదికపై కలుసుకునే అరుదైన అవకాశంగా ఈ సదస్సు నిలవనుంది. తెలుగు భాషా వికాసం, సాహిత్య పరిరక్షణ, ప్రపంచవ్యాప్తంగా తెలుగు సంస్కృతి విస్తరణపై చర్చలకు ఇది వేదిక కానుంది. సదస్సులో ప్రత్యక్షంగా పాల్గొనాలనుకునే ఆసక్తిగల ప్రతినిధులు తమ వివరాలను గూగుల్ ఫామ్ ద్వారా నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
భారత్తో పాటు ప్రపంచంలోని ఏ దేశం నుంచి వచ్చినా ప్రతినిధులు తమ సొంత ఖర్చులతో షాంఘై చేరుకుని సదస్సులో పాల్గొనవచ్చు. ప్రత్యక్షంగా హాజరయ్యే ప్రతినిధులు, వక్తలకు మూడు రోజుల పాటు స్థానిక వసతి, ఆత్మీయ ఆతిథ్యం నిర్వాహకుల తరఫున అందించనున్నట్లు తెలిపారు. అయితే చైనా వీసా, విమాన ప్రయాణ ఏర్పాట్లు మాత్రం పాల్గొనే వారు స్వయంగా చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ సాహిత్య వేడుక నిర్వహణలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నుంచి వంగూరి చిట్టెన్ రాజు, షాంఘై తెలుగు సంఘం నుంచి కోలన్ మాధవ రెడ్డితో పాటు షాయి రాచకొండ, రాధిక మంగిపూడి, నాగ మల్లికార్జున రావు తోట, భవాని వాసిరెడ్డి, జయ పీసపాటి, రత్నకుమార్ కవుటూరు తదితరులు భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు భాషా ప్రేమికులు, సాహిత్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ చారిత్రాత్మక సదస్సును విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
Tags
Be the first to react