37 మంది ప్రవాస కళాకారులతో ‘మోహినీ భస్మాసుర’ నృత్యనాటక ప్రదర్శన..
సిన్సినాటిలో అంబరాన్నంటిన తెలుగు సాంస్కృతిక సంబరాలు..
సిన్సినాటి: విదేశీ గడ్డపై తెలుగు సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటుతూ అమెరికాలోని సిన్సినాటి నగరంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం ఘన విజయాన్ని సాధించింది. డా. రామినేని ఫౌండేషన్, సిన్సినాటి తరంగిణి తెలుగు అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో “మోహినీ భస్మాసుర” కూచిపూడి నృత్యనాటకం అద్భుతంగా ప్రదర్శితమైంది.
ఎమరీ థియేటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రవాస తెలుగు సమాజం నుంచి భారీ స్పందన లభించింది. ప్రముఖ కూచిపూడి గురువు, కళారత్న కె.వి. సత్యనారాయణ రచన, నృత్య దర్శకత్వంలో రూపొందిన ఈ పౌరాణిక నృత్య రూపకం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ ప్రదర్శనలో మోహినీ పాత్రలో చదలవాడ శ్రిల హైంధవి, భస్మాసురుడి పాత్రలో చదలవాడ శ్రీధ వరాళి తమ అద్భుతమైన హావభావాలు, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. వంశీ డ్యాన్స్ అకాడమీకి చెందిన పలువురు విద్యార్థులు ఇతర పాత్రల్లో తమ ప్రతిభను ప్రదర్శించి నాటకానికి మరింత జీవం పోశారు. కార్యక్రమానికి వంశీ చిట్టాజల్లు వ్యాఖ్యాతగా వ్యవహరించి కథాంశాన్ని ప్రేక్షకులకు సులభంగా వివరించారు.
ఈ నాటక ప్రదర్శన వెనుక కళాకారుల కృషి ఎంతో ఉంది. ప్రత్యేకంగా నృత్య దర్శకుడు కె.వి. సత్యనారాయణ సిన్సినాటిలో పది రోజుల పాటు ఉండి స్థానిక కళాకారులకు శిక్షణ అందించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు మొత్తం 37 మంది ప్రవాస కళాకారులు ఈ నృత్యనాటకంలో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
కూచిపూడి నృత్య శైలి, పౌరాణిక కథాంశం కలయికతో రూపొందించిన ఈ ప్రదర్శన ప్రేక్షకులకు తెలుగు కళా సంపదను మరోసారి గుర్తు చేసింది. శాస్త్రీయ నృత్యంలో ఉన్న అందం, భావవ్యక్తీకరణను కళాకారులు అద్భుతంగా ఆవిష్కరించారు.
ప్రదర్శన అనంతరం కూచిపూడి రంగానికి దశాబ్దాలుగా సేవలందిస్తున్న కళారత్న కె.వి. సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. డా. రామినేని ఫౌండేషన్ ఛైర్మన్ రామినేని ధర్మాచార్య, ఆంధ్రప్రదేశ్ బీజేపీ మీడియా వ్యవహారాల ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం, డా. చదలవాడ రాజగోపాల్, చదలవాడ శారదలు ఆయనకు శాలువా కప్పి, జ్ఞాపిక అందించి గౌరవించారు.
విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తెలుగు భాష, కళలు, సంస్కృతిని భావితరాలకు చేరవేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని ప్రముఖులు పేర్కొన్నారు. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచ వేదికపై నిలబెడుతున్న ఈ ప్రయత్నాన్ని ప్రవాసులు అభినందించారు.
Tags
Be the first to react