ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు క్యాబ్ సంస్థలకు పోటీగా ప్రభుత్వం కొత్తగా ‘ఆంధ్రా ట్యాక్సీ’ అనే యాప్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ యాప్ ద్వారా ప్రజలు ఆటో, ట్యాక్సీలను తక్కువ ధరలకు, సురక్షితంగా బుక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా విజయవాడ వంటి నగరాల్లో ప్రయాణికులపై జరుగుతున్న అధిక ఛార్జీల దోపిడీకి చెక్ పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం.
విజయవాడకు వచ్చే పర్యాటకులు, భక్తుల నుంచి కొంతమంది ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆధ్వర్యంలో ఈ ఆంధ్రా ట్యాక్సీ పోర్టల్/యాప్ రూపకల్పన జరిగింది. దుర్గగుడి, భవానీ ద్వీపం వంటి పర్యాటక ప్రాంతాలకు చౌకగా, నమ్మకమైన రవాణా సేవలు అందించడమే ప్రధాన ఉద్దేశం.
ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే, కేవలం యాప్ ద్వారానే కాకుండా వాట్సప్, ఫోన్ కాల్, క్యూఆర్ కోడ్ ద్వారా కూడా బుకింగ్ సదుపాయం కల్పించడం. ప్రయాణికులు తమ గమ్యస్థానాన్ని నమోదు చేస్తే, అక్కడ రిజిస్టర్ అయిన డ్రైవర్ల వివరాలు వెంటనే కనిపిస్తాయి. ముందుగా అధికారులు పరిశీలించిన డ్రైవర్లకే యాప్‌లో అవకాశం ఇవ్వడం జరుగుతుంది.
రవాణా శాఖ ఫిట్‌నెస్ ఉన్న వాహనాలకే అనుమతి ఇవ్వడంతో పాటు, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వాహనాల వివరాలు, బుకింగ్ సమాచారం స్థానిక పోలీస్ స్టేషన్లకు చేరేలా యాప్‌ను డిజైన్ చేశారు. అలాగే ప్రయాణికుల వ్యక్తిగత డేటా రాష్ట్ర డేటా కేంద్రంలో భద్రంగా నిల్వ ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు.
విజయవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ సేవలు విస్తరించనున్నారు. రవాణాతో పాటు హోటల్ బుకింగ్, టూర్ ప్యాకేజీలు, భవిష్యత్తులో రైతులకు ఉపయోగపడే డ్రోన్ సేవలు కూడా ఈ యాప్‌లో అందించనున్నారు. ‘ఆంధ్రా ట్యాక్సీ’ యాప్‌ను త్వరలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.