వరుస పండుగల నేపథ్యంలో రాష్ట్రాల్లో ప్రయాణాల హడావుడి మొదలవుతోంది. మరో ఐదు రోజుల్లో క్రిస్మస్, ఆ వెంటనే న్యూఇయర్, ఆ తరువాత పది రోజుల్లో తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి రానుండటంతో బస్సులు, రైళ్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరగనుంది. ప్రతి ఏటా ఈ పండుగల సీజన్‌లో లక్షలాది మంది తమ స్వస్థలాలకు వెళ్లేందుకు రోడ్డు, రైలు మార్గాలను ఆశ్రయిస్తుంటారు. ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన ఆర్టీసీ, రైల్వే శాఖలు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక సర్వీసులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రకటించగా, దక్షిణ మధ్య రైల్వే కూడా స్పెషల్ ట్రైన్లతో ప్రయాణికుల రద్దీని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది.
పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈసారి భారీ సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ వెల్లడించారు. ఇప్పటికే 124 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని, త్వరలో మరిన్ని స్పెషల్ ట్రైన్లను అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు. ఈ పండుగల సీజన్‌లో మొత్తం 600 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించిందన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, అనకాపల్లి, నర్సాపూర్, కాకినాడ, తిరుపతి, శ్రీకాకుళం, గుంటూరు వంటి ప్రధాన మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. పండుగ రద్దీ కారణంగా ఈ ట్రైన్లలో అదనపు ఛార్జీలు ఉంటాయని స్పష్టం చేశారు.
ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఉండటంతో ఇప్పటికే ఈ ప్రత్యేక రైళ్లకు భారీ డిమాండ్ ఏర్పడిందని అధికారులు తెలిపారు. వెయిటింగ్ లిస్ట్ పరిస్థితిని బట్టి అవసరమైతే మరిన్ని ప్రత్యేక రైళ్లను కూడా ప్రవేశపెడతామని వెల్లడించారు. ఈ పండుగల సీజన్‌లో హైదరాబాద్ నుంచి రైళ్ల ద్వారా సుమారు 30 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేశారు. గత ఏడాది పండుగల సమయంలో సుమారు 500 ప్రత్యేక రైళ్లను నడిపామని, ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచామని శ్రీధర్ పేర్కొన్నారు. ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
ఇక సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఒక్కో టికెట్‌కు వేలకు వేలు వసూలు చేస్తూ ప్రజలపై అదనపు భారం మోపుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఈసారి కూడా సంక్రాంతి కోసం అదనపు బస్సులను నడపాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలనే వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పండుగల సమయంలో ప్రయాణికులకు ఆర్టీసీ పెద్ద ఊరటగా మారనుంది.