ఒకప్పుడు విమాన ప్రయాణం అంటే అదో విలాసం, అత్యంత వేగంగా గమ్యాన్ని చేర్చే మార్గం. కానీ, నేడు పరిస్థితి తలకిందులైంది. విమానం ఎక్కడం అంటేనే ప్రయాణీకులు భయపడే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మన దేశంలో ఇటీవల ఇండిగో (IndiGo) విమాన సర్వీసుల్లో తలెత్తిన సంక్షోభం ప్రయాణీకులను ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలిసిందే.
వేల సంఖ్యలో సర్వీసులు రద్దు కావడం, టికెట్ ధరలు ఆకాశాన్ని తాకడం, గంటల కొద్దీ ఆలస్యం.. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ప్రయాణీకులు నరకం చూశారు. అయితే, ఈ సమస్య కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణం ఒక సవాలుగా మారింది.
తాజాగా, కాంగోకు చెందిన ఓ విమానం గంటల పాటు డిలే అయింది. అది కూడా ప్రయాణీకులు విమానంలో కూర్చున్న తర్వాత డిలే అయింది. దీంతో నరకం చూసిన ప్రయాణీకులు కొందరు ఊహించని పని చేశారు. విమానంలోనుంచి తలుపు ద్వారా కిందకు దూకేశారు.
సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోకు చెందిన ఎయిర్ కాంగో విమానం ఒకటి కిందు ఎయిర్‌పోర్టులో ఆగిపోయింది. ప్రయాణీకులు విమానంలోకి ఎక్కిన తర్వాత డిలే మొదలైంది. గంటలు గడిచినా విమానం కదల్లేదు.
దీంతో ప్రయాణీకులు అసహనానికి గురయ్యారు. కొంతమంది విమానం మెయిన్ డోర్ నుంచి కిందకు దూకేశారు. దాదాపు 5 నుంచి 6 అడుగుల ఎత్తులోనుంచి తోటి ప్రయాణీకుల సాయంతో బయటకు వచ్చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక, వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘విమానం ప్రయాణం అంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తోంది. పైగా డిలేలతో నరకం చూడాల్సి వస్తోంది’..‘కేవలం ఇండియాలోనే ఇలా ఉంటుందని అనుకున్నా.. వేరే దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయన్న మాట’.. ‘అది చిన్న విమానంలాం ఉంది.
అందుకే కిందకు దూకగలిగారు. పెద్ద విమానం అయితే కాళ్లు, చేతులు విరిగిపోతాయి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. విమానయాన సంస్థలు లాభాల మీద పెడుతున్న శ్రద్ధలో సగం ప్రయాణీకుల భద్రత మరియు సౌకర్యాల మీద పెడితే ఇలాంటి ఘటనలు జరగవు. విమానం లోపల గంటల తరబడి ప్రయాణీకులను ఉంచడం మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. రన్‌వేపై విమానం నిలిచిపోయినప్పుడు సరైన వెలుతురు, గాలి మరియు ఆహార సదుపాయాలు కల్పించడం కనీస బాధ్యత.