ఊబకాయం, అధిక బరువు సమస్యలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని వేధిస్తున్నాయి. డైట్ నియంత్రణ, వ్యాయామం, ఖరీదైన ఇంజెక్షన్లు, మందులు వంటి ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ శాశ్వత పరిష్కారం మాత్రం ఇంకా దొరకలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అమెరికా శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధన ఆశాజనకంగా మారింది. సహజసిద్ధంగా బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషించే ఒక ప్రత్యేకమైన పేగు బ్యాక్టీరియాను వారు గుర్తించారు. ఈ కనుగొనడం భవిష్యత్తులో ఊబకాయానికి మందుల అవసరం లేకుండా చికిత్స చేసే దిశగా మార్గం చూపే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.
అమెరికాలోని ఉటా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఎలుకలపై నిర్వహించిన అధ్యయనంలో ‘ట్యూరిసిబాక్టర్’ (Turicibacter) అనే గట్ బ్యాక్టీరియా బరువు పెరుగుదలను నియంత్రించడంలో కీలకంగా పనిచేస్తుందని గుర్తించారు. అధిక కొవ్వు ఉన్న ఆహారం ఇచ్చినప్పటికీ, ఈ బ్యాక్టీరియా ఉన్న ఎలుకల్లో బరువు పెరుగుదల తగ్గినట్టు, రక్తంలో చక్కెర స్థాయిలు, కొవ్వు పరిమాణం కూడా నియంత్రణలో ఉన్నట్టు వారు వెల్లడించారు. ఈ పరిశోధన ఫలితాలను ప్రతిష్ఠాత్మక ‘సెల్ మెటబాలిజం’ జర్నల్‌లో ప్రచురించారు. ముఖ్యంగా ఊబకాయంతో బాధపడే వ్యక్తుల్లో ఈ బ్యాక్టీరియా స్థాయి చాలా తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు గమనించారు.
ట్యూరిసిబాక్టర్ బ్యాక్టీరియా శరీరంలో ‘సెరామైడ్లు’ అనే కొవ్వు అణువుల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందని పరిశోధకులు తెలిపారు. సాధారణంగా అధిక సెరామైడ్లు టైప్–2 మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులతో సంబంధం కలిగి ఉంటాయి. ట్యూరిసిబాక్టర్ ఈ సెరామైడ్లను నియంత్రించడం ద్వారా మెటబాలిజం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అధ్యయనం సూచిస్తోంది. అంటే ఈ బ్యాక్టీరియా కేవలం బరువు తగ్గడానికే కాకుండా, దీర్ఘకాలిక జీవనశైలి వ్యాధులను కూడా తగ్గించే శక్తి కలిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
అయితే, ఇప్పటివరకు ఈ ఫలితాలు కేవలం ఎలుకలపై చేసిన ప్రయోగాల ఆధారంగానే లభించాయని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఇవి మనుషులపై కూడా అదే విధంగా పనిచేస్తాయా లేదా అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది. “ఎలుకలలో మంచి ఫలితాలు వచ్చాయి కానీ మనుషుల్లో ఎంతవరకు ఉపయోగపడుతుందో ఇంకా చెప్పలేం” అని పరిశోధక బృందం పేర్కొంది. అయినప్పటికీ, భవిష్యత్తులో గట్ మైక్రోబయోమ్ ఆధారిత చికిత్సల ద్వారా ఊబకాయాన్ని నియంత్రించే కొత్త తరహా మందులు అభివృద్ధి చేసే దిశగా ఈ పరిశోధన కీలక మలుపుగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.