దేశంలో కొత్త విమానయాన సంస్థలకు కేంద్ర పౌర విమానయాన శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అల్ హింద్, ప్లె ఎక్స్‌ప్రెస్ అనే రెండు కొత్త విమానయాన సంస్థలకు అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో దేశీయ విమానయాన రంగంలో పోటీ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ఇప్పటికే శంఖ్ ఎయిర్ అనే మరో విమాన సంస్థకు కూడా పౌర విమానయాన శాఖ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అవసరమైన సాంకేతిక, పరిపాలనా ఏర్పాట్లు పూర్తయిన వెంటనే శంఖ్ ఎయిర్ సేవలు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. కొత్త విమాన సంస్థల రాకతో ప్రయాణికులకు మరిన్ని రూట్లు, మెరుగైన సేవలు లభించనున్నాయి.
కొత్తగా అనుమతి పొందిన విమాన సంస్థల వివరాలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. దేశీయ విమానయాన రంగం విస్తరిస్తోందని, ఇది ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడేందుకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.