ఇప్పటివరకు FASTag అంటే టోల్ ప్లాజాల వద్ద ఆగకుండా చెల్లింపులు చేయడమే అన్న భావన ప్రజల్లో ఉంది. హైవేలపై ప్రయాణిస్తున్నప్పుడు టోల్ బూత్ దగ్గర వాహనాన్ని ఆపాల్సిన అవసరం లేకుండా, ఆటోమేటిక్‌గా టోల్ ఫీజు కట్ అయ్యే సౌకర్యం FASTag అందిస్తోంది. దీని వల్ల సమయం ఆదా కావడంతో పాటు ట్రాఫిక్ రద్దీ కూడా గణనీయంగా తగ్గింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం FASTag వినియోగాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. టోల్ చెల్లింపులకే పరిమితం కాకుండా, దీనిని ఒక బహుళార్ధసాధక డిజిటల్ పేమెంట్ వ్యవస్థగా మార్చే దిశగా రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కీలక ప్రణాళికలు రూపొందిస్తోంది.
భవిష్యత్తులో పార్కింగ్ ఫీజులు, పెట్రోల్ బంకుల వద్ద ఇంధన చెల్లింపులు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, ఇతర ప్రయాణ సౌకర్యాలకు సంబంధించిన చెల్లింపులను కూడా FASTag ద్వారానే చేసేలా ప్రభుత్వం యోచిస్తోంది. దైనిక్ భాస్కర్ కథనం ప్రకారం, గత ఆరు నెలలుగా ఈ వ్యవస్థపై ప్రయోగాత్మకంగా ట్రయల్స్ నిర్వహించగా అవి విజయవంతమయ్యాయి. FASTag ఒక డిజిటల్ వాలెట్‌లా పనిచేస్తుందని అధికారులు వెల్లడించారు. దీని వల్ల ప్రయాణ సమయంలో చిన్న చిన్న చెల్లింపుల కోసం వేర్వేరు యాప్‌లు వాడటం లేదా నగదు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదని తెలిపారు.
ఈ కొత్త విధానంతో డిజిటల్ మోసాలు తగ్గే అవకాశముందని కూడా కేంద్రం భావిస్తోంది. FASTag ద్వారా అన్ని ప్రయాణ సంబంధిత ఖర్చులు ఒకే ప్లాట్‌ఫామ్‌లో చెల్లించే అవకాశం లభిస్తే, వినియోగదారులకు మరింత భద్రతతో పాటు సౌలభ్యం కూడా కలుగుతుంది. ఇటీవల బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశాల్లో ఈ అంశంపై ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. FASTag ద్వారా టోల్ పన్నులతో పాటు పెట్రోల్ పంపులు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, పార్కింగ్ ఫీజులు, ఆహార దుకాణాలు, వాహన నిర్వహణ ఖర్చులు, నగరాల్లో ప్రవేశ రుసుములు వంటి అనేక చెల్లింపులు చేయగలిగేలా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు.
ఇప్పటికే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో FASTag ద్వారా పార్కింగ్ ఫీజులు వసూలు చేయడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ఢిల్లీ డివిజన్ కొత్త పార్కింగ్ విధానాన్ని రూపొందించిందని సమాచారం. ఈ విధానం అమల్లోకి వస్తే స్టేషన్ ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద ట్రాఫిక్ రద్దీ భారీగా తగ్గే అవకాశం ఉంది. దాదాపు 80 శాతం వాహనాలు ప్రయాణికులను దింపేందుకు లేదా ఎక్కించుకోవడానికి మాత్రమే స్టేషన్‌కు వచ్చి వెంటనే వెళ్లిపోతాయని అంచనా. ఈ నేపథ్యంలో FASTag ఆధారిత పార్కింగ్ చెల్లింపులు ప్రయాణికులకు పెద్ద ఊరటగా మారనున్నాయి. మొత్తం మీద FASTag భవిష్యత్తులో భారతదేశ ప్రయాణ వ్యవస్థలో కీలక డిజిటల్ పేమెంట్ సాధనంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.