జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదం జరిగితే చికిత్స కోసం ఆర్థిక సహాయం కోసం ఇబ్బంది పడే వారికి కేంద్రం భరోసానిచ్చారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి తక్షణమే వైద్య సహాయం అందాలి, ఆర్థిక పరిస్థితి అతని ప్రాణాలకు అడ్డంకి కావద్దు అనే ఉద్దేశంతో నగదు అవసరం లేని వైద్య చికిత్స విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, రోడ్డు ప్రమాద బాధితుల కుటుంబాలకు పెద్ద ఊరట అని చెప్పుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న ఈ కొత్త విధానం ప్రకారం, దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన ప్రతి వ్యక్తికి ఆసుపత్రిలో చేరిన మొదటి ఏడు రోజుల వరకు గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు క్యాష్‌లెస్ వైద్య చికిత్స లభించనుంది. అంటే ఆసుపత్రిలో చేరిన వెంటనే అడ్వాన్స్ డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు. ఇప్పటివరకు అనేక సందర్భాల్లో చికిత్స ఖర్చుల భయం, డబ్బుల లేమి కారణంగా గాయపడిన వారికి సరైన సమయంలో చికిత్స అందక ప్రాణనష్టం జరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చడానికే కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ పథకాన్ని రూపొందించి అమలు చేసే బాధ్యతను Ministry of Road Transport and Highways తీసుకుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయగా, ఆశించిన స్థాయిలో మంచి ఫలితాలు వచ్చినట్లు సమాచారం. అదే అనుభవాన్ని ఆధారంగా చేసుకుని, ఇప్పుడు అన్ని జాతీయ రహదారులపై ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ–ప్రైవేట్ ఆసుపత్రులతో కలిసి ఒక సమగ్ర వ్యవస్థను రూపొందిస్తున్నారు.
రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే తొలి కొన్ని గంటలను వైద్యులు ‘గోల్డెన్ అవర్’గా పిలుస్తారు. ఈ సమయంలో బాధితుడికి సరైన చికిత్స అందితే ప్రాణాలు కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో ప్రమాద స్థలానికి అంబులెన్స్ చేరుకునే విషయంలోనూ కేంద్రం కీలక మార్పులు తీసుకురానుంది. ప్రమాద సమాచారం అందిన 10 నిమిషాల లోపు అంబులెన్స్ సంఘటన స్థలానికి చేరుకోవాలనే లక్ష్యంతో కొత్త విధానాన్ని రూపొందిస్తున్నారు. ఈ సమయాన్ని ‘క్విక్ రియాక్షన్ టైమ్’గా పరిగణిస్తారు. నిర్ణీత సమయంలో అంబులెన్స్ చేరితే, దానికి అయ్యే ఖర్చును కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయం రోడ్డు ప్రమాద బాధితులు మాత్రమే కాకుండా వారి కుటుంబాలకు కూడా పెద్ద సహాయమని చెప్పుకోవాలి . అత్యవసర సమయంలో అప్పులు చేయడం, ఆస్తులు అమ్ముకోవడం వంటి పరిస్థితులు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రాణాలను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా తీసుకున్న ఈ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే, దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే అనవసర మరణాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.