బెంగళూరు లాంటి ట్రాఫిక్ నగరంలో ప్రయాణం అంటేనే ఒక యుద్ధం. అందులోనూ మెట్రో స్టేషన్ దిగాక, మళ్ళీ బస్సు పట్టుకోవడానికి అర కిలోమీటరో, కిలోమీటరో నడవాలంటే ఆ ఆయాసం, అలసట వర్ణనాతీతం. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లేవారు, లగేజీతో ఉన్నవారు ఈ దూరాన్ని చూసి చాలా ఇబ్బంది పడేవారు.
అయితే, బెంగళూరు మెట్రో ‘ఎల్లో లైన్’ ప్రయాణికుల ఈ కష్టాలకు ఇప్పుడు తెరపడనుంది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని మెట్రో అధికారులు మరియు రవాణా శాఖ ఒక వినూత్న మార్పుకు శ్రీకారం చుట్టారు. దీనివల్ల ప్రయాణికులు మెట్రో దిగిన వెంటనే.. బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఈ నిర్ణయం వల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా.. ప్రయాణికులు నడిచే శ్రమ కూడా తగ్గుతుంది. ప్రయాణికుల రద్దీ, ఫీడర్ బస్సుల అవసరాన్ని బట్టి బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ స్టేషన్ల వద్ద ఈ కొత్త షెల్టర్లను నిర్మించారు.
బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (బీఎంటీసీ), బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (బీఎంఆర్‌సీ) కలిసి.. ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆర్‌వీ రోడ్, సెంట్రల్ సిల్క్ బోర్డ్, హోంగసంద్ర, సింగసంద్ర, బెరతేన అగ్రహార, బయోకాన్ హెబ్బగోడి స్టేషన్ల వద్ద ఈ కొత్త బస్టాండ్లను ఏర్పాటు చేశారు.
వీటితో పాటు ఎలక్ట్రానిక్ సిటీ, హోసా రోడ్, రాగిగుడ్డ స్టేషన్ల వద్ద పాత బస్సు స్టాప్‌లను మెట్రో స్టేషన్లకు మరింత దగ్గరగా తీసుకొచ్చారు. ఈ కొత్త సౌకర్యం ముఖ్యంగా వృద్ధులకు, మహిళలకు, లగేజీతో ప్రయాణించే వారికి చాలా ప్రయోజనం కలగనుంది.
నడవాల్సిన దూరం తగ్గడం వల్ల వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెట్రో నుంచి.. బస్సుల్లో ప్రయాణించవచ్చని పేర్కొంటున్నారు. పీక్ అవర్స్‌లో మెట్రో స్టేషన్ల వద్ద రద్దీని తగ్గించడానికి, ప్రయాణికులను త్వరగా వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ఈ బస్సు సౌకర్యాలు ఎంతో సహాయపడతాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
డిసెంబర్ 22వ తేదీ నుంచి బెంగళూరు ఎల్లో లైన్ మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకల సమయం మెరుగుపడనుంది. కొత్తగా ఆరో రైలు అందుబాటులోకి రావడంతో.. ప్రతీ 12 నిమిషాలకు ఒక రైలు నడుస్తుందని అధికారులు తెలిపారు. దీనివల్ల ప్రయాణికులు ప్లాట్‌ఫారమ్‌లపై వేచి ఉండే సమయం తగ్గుతుందని వెల్లడించారు.
నగరాభివృద్ధి అంటే కేవలం పెద్ద పెద్ద వంతెనలు కట్టడం మాత్రమే కాదు, సామాన్య ప్రయాణికుడికి కలిగే చిన్న చిన్న ఇబ్బందులను తొలగించడం కూడా. బెంగళూరు మెట్రో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ పట్ల ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. మెట్రో - బస్సు మధ్య ఈ అనుసంధానం మిగిలిన నగరాలకు కూడా ఆదర్శంగా నిలవాలి.