కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి అభివృద్ధి పనులు వేగంగా ముందుకెళ్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం రహదారులు, రైల్వే మార్గాలు వంటి మౌలిక వసతుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి మీదుగా ప్రతిపాదించిన కొత్త రైల్వే లైన్‌కు సంబంధించి కేంద్ర రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టు కోసం 77 ఎకరాల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.
అమరావతి మీదుగా ఎర్రుపాలెం–నంబూరు మధ్య 56.53 కిలోమీటర్ల బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఈ రైల్వే లైన్ రాజధాని ప్రాంతానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించనుంది. ఇందుకోసం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో భూసేకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుతో అమరావతి ప్రాంతం రైల్వే నెట్‌వర్క్‌తో మరింత బలంగా అనుసంధానం కానుంది.
భూసేకరణలో భాగంగా చిలుకూరు గ్రామంలో 26.02 ఎకరాలు, దాములూరు గ్రామంలో 51.134 ఎకరాల వ్యవసాయ భూమి సేకరించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. చిలుకూరులో 59 సర్వే నంబర్లు, దాములూరులో 22 సర్వే నంబర్ల పరిధిలో ఈ భూములు ఉన్నాయి. ఈ మేరకు భూసేకరణకు సంబంధించిన పూర్తి వివరాలతో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ భూసేకరణపై అభ్యంతరాలు ఉన్న రైతులు లేదా భూస్వాములు తమ వాదనలను విజయవాడ ఆర్డీవోకు రాతపూర్వకంగా తెలియజేయవచ్చని అధికారులు సూచించారు. అందిన అభ్యంతరాలపై విచారణ చేపట్టి, వాద–ప్రతివాదనలు విన్న తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. భూసేకరణ, పరిహారం ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
ఈ రైల్వే లైన్ నిర్మాణంతో చిలుకూరు, దాములూరు గ్రామాలే కాకుండా పరిసర ప్రాంతాలకు కూడా అభివృద్ధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. కనెక్టివిటీ మెరుగుపడటంతో భూముల విలువలు పెరగడం, వాణిజ్య కార్యకలాపాలు విస్తరించడం వంటి లాభాలు కలగనున్నాయి. భూసేకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.