కర్ణాటకలో మరో హృదయ విదారక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిత్రదుర్గ జిల్లా హిరియూర్ తాలూకాలోని హోర్లథు క్రాసింగ్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగి భారీ విషాదానికి దారితీసింది.
లారీ ఢీకొట్టిన వెంటనే బస్సులోని డీజిల్ ట్యాంక్ పేలడంతో మంటలు వ్యాపించాయి. రెప్పపాటు సమయంలోనే మంటలు బస్సు అంతటా వ్యాపించడంతో ప్రయాణికులు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. నిద్రలో ఉన్న ప్రయాణికుల్లో చాలామంది మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మొత్తం 17 మంది సజీవ దహనమయ్యారు.
ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. సిరా ఆస్పత్రిలో 9 మంది, హిరియూర్ ఆస్పత్రిలో మరికొందరికి చికిత్స అందుతోంది. గాయపడిన వారి పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ప్రమాదానికి గురైన వాహనం సీబర్డ్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సుగా గుర్తించారు. బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ బస్సు బెంగళూరు నుంచి గోకర్ణం వైపు ప్రయాణిస్తుండగా, యూటర్న్ తీసుకుంటున్న సమయంలో లారీ వేగంగా వచ్చి ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో తెల్లవారుజామున కావడంతో ఎక్కువ మంది గాఢ నిద్రలో ఉన్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మంటల్లో దగ్ధమైన బస్సు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రైవేట్ బస్సుల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.