భారతదేశంలో హైవేల్లో ప్రయాణించే కోట్లాది వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో టోల్ ప్లాజాల వద్ద ఉండే క్యూలకు పూర్తిగా చెక్ పెట్టే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. 2026 సంవత్సరం చివరి నాటికి దేశవ్యాప్తంగా GPS ఆధారిత, ఉపగ్రహ సహాయంతో పనిచేసే ఆధునిక టోల్ వసూలు వ్యవస్థను పూర్తిగా అమలు చేయనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో వెల్లడించారు. ఈ కొత్త విధానం ద్వారా వాహనదారులకు సమయం, ఇంధనం రెండింటిలోనూ భారీ ఆదా కలగనుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా నిరంతర ప్రయాణాన్ని అందించడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
రాబోయే ఈ టోల్ వసూలు విధానం మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఈ వ్యవస్థలో కృత్రిమ మేధస్సు ఆధారిత ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR), ఉపగ్రహ సాంకేతికత, ఇప్పటికే వినియోగంలో ఉన్న FASTagలను అనుసంధానం చేస్తారు. దీని ద్వారా వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన పనిలేకుండా, గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా టోల్ స్వయంచాలకంగా కట్ అవుతుంది. దీంతో భౌతిక టోల్ బూత్‌లు, మానవ జోక్యం అవసరం తగ్గనుంది. ఈ వ్యవస్థ వల్ల టోల్ వసూలు మరింత పారదర్శకంగా మారనుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ప్రయాణికులకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ గడ్కరీ కీలక వివరాలు వెల్లడించారు. గతంలో టోల్ చెల్లింపుల కోసం ఒక్కో వాహనానికి 3 నుంచి 10 నిమిషాల వరకు సమయం వృథా అయ్యేదని తెలిపారు. FASTag ప్రవేశంతో అది సుమారు 60 సెకన్లకు తగ్గిందని, ఇప్పుడు ప్రభుత్వం జీరో నిమిషాల నిరీక్షణ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఈ కొత్త టెక్నాలజీ అమలుతో ఏటా దాదాపు రూ.1,500 కోట్ల విలువైన ఇంధనం ఆదా అవుతుందని, అలాగే టోల్ లీకేజీలు పూర్తిగా తగ్గి ప్రభుత్వ ఆదాయం సుమారు రూ.6,000 కోట్ల వరకు పెరుగుతుందని అంచనా వేశారు. అంతేకాదు, కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
అయితే ఈ వ్యవస్థ జాతీయ రహదారులకే పరిమితమని, రాష్ట్ర, నగర రహదారుల బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదని గడ్కరీ స్పష్టం చేశారు. టోల్ కార్యకలాపాల్లో అవకతవకలకు పాల్పడే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన కాంట్రాక్టర్లను రెండేళ్ల పాటు డిబార్ చేయడంతో పాటు, కొత్త టెండర్లలో పాల్గొనే అవకాశం లేకుండా చేస్తామని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న పైలట్ ప్రాజెక్టుల ఫలితాల ఆధారంగా దశలవారీగా ఈ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. మొత్తంగా టోల్ వ్యవస్థను అవినీతి రహితంగా, సాంకేతికంగా ఆధునికంగా మార్చి, హైవే ప్రయాణ అనుభవాన్ని పూర్తిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు.