ఏపీ రైలు ప్రయాణికులకు ముఖ్యంగా అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ప్రజలకు శుభవార్త లభించింది. యశ్వంత్‌పూర్–కాచిగూడ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు హిందూపురం రైల్వే స్టేషన్‌లో హాల్ట్ మంజూరు చేశారు. ఈ సౌకర్యం డిసెంబర్ 27 నుంచి అమల్లోకి రానుందని రైల్వే అధికారులు ప్రకటించారు. దీంతో ఈ ప్రాంత ప్రజల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది.
20704/20703 నంబర్లతో నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ హిందూపురంలో రెండు నిమిషాల పాటు ఆగనుంది. డిసెంబర్ 27న కాచిగూడ నుంచి వచ్చే రైలుకు రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న హిందూపురంలో పూజలు చేసి జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ మేరకు సౌత్ వెస్ట్రన్ రైల్వే డిప్యూటీ సీవోఎం ఎన్. రాజ్‌కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ రైలు ప్రతిరోజూ ఉదయం 5.45 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు హిందూపురం చేరుకుంటుంది. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో యశ్వంత్‌పూర్ నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి, 3.35 గంటలకు హిందూపురం చేరుకొని కాచిగూడకు కొనసాగుతుంది. ఈ టైమింగ్స్ ప్రయాణికులకు ఎంతో అనుకూలంగా ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.
హిందూపురంలో వందేభారత్ హాల్ట్ కోసం స్థానిక ఎంపీ బీకే పార్థసారథి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఆయన రైల్వే మంత్రిని కోరడంతో వెంటనే అనుమతి లభించింది. బెంగళూరు ప్రయాణం కోసం హిందూపురం, అనంతపురం ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వెళ్తుంటారు. వారికి ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఎంతో ఉపయోగపడనుందని అధికారులు భావిస్తున్నారు.
ఇదే సమయంలో ఏపీకి మరో కొత్త రైలు సేవ కూడా త్వరలో ప్రారంభం కానుంది. గుంతకల్లు నుంచి డోన్ మీదుగా మార్కాపురం రోడ్డు స్టేషన్ వరకు కొత్త ప్యాసింజర్ రైలు ప్రవేశపెట్టనున్నారు. ఈ రైలు గుంతకల్లు డివిజన్ పరిధిలో పలు గ్రామాలను కలుపుతూ ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండనుంది. కొత్త రైలు ప్రారంభ తేదీపై త్వరలో స్పష్టత రానుందని రైల్వే శాఖ తెలిపింది.